నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్‌లో జరిగిన 13వ ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణను దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని, ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయని సీఎం తెలిపారు.
టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమే కాదు.. చేనేతలకు జీవితం. దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్గా హైదరాబాద్ మారింది. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం. పర్యావరణ పరిరక్షణే మా తొలి ప్రాధాన్యం అని సీఎం అన్నారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఇక్కడి పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి పేరుందని పేర్కొన్నారు. లండన్, పారిస్, దుబాయ్ వంటి ఫ్యాషన్ నగరాల్లో తెలంగాణలో తయారైన దుస్తులు మెరవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.



