Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ విలన్‌ రేవంత్‌రెడ్డి

తెలంగాణ విలన్‌ రేవంత్‌రెడ్డి

- Advertisement -

సీఎం జలద్రోహానికి కేంద్రం ప్రకటించిన కమిటీలే నిదర్శనం
ప్రభుత్వ తీరుతో గోదావరి-నల్లమల సాగర్‌కు లైన్‌క్లియర్‌ : బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ జలద్రోహానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కమిటీలే నిదర్శనమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో గోదావరి-నల్లమల సాగర్‌కు లైన్‌క్లియరైందని తెలిపారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నెంబర్‌వన్‌ విలన్‌ రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లతో కేంద్ర ప్రభుత్వ అధికారులను చేర్చి తెలంగాణ, ఏపీల మధ్య నీటి వాటా పంపిణీ కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శా కమిటీ ఖరారు చేసిందని వివరించారు.

ఏపీ కమిటీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారని తెలిపారు. తెలంగాణ కమిటీలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు, ఒక ఇంజినీర్‌ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ కమిటీలో ఐఎస్‌ అండ్‌ డబ్ల్యూఆర్‌లో అనుభవం ఉన్న అధికారి ఉంటే తెలంగాణ కమిటీలో ఐఎస్‌ అండ్‌ డబ్ల్యూఆర్‌లో అనుభవం లేని అధికారి ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కమిటీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు మూడు నెలల్లో పూర్తి చేయడమంటే నల్లమల సాగర్‌కు ఆమోదం తెలపడమేనని తెలిపారు. ఇది రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు నష్టం చేసి ఏపీకి మేలు చేసే చర్య అని విమర్శించారు. టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి డీపీఆర్‌ను ఆపేందుకు స్టే తెస్తే టెండర్‌ ఖరారయ్యేది కాదని పేర్కొన్నారు. ఐఐసీ టెక్నాలజీ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థకు పోలవరం నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు టెండర్‌ ఖరారైందని తెలిపారు. ఇది కచ్చితంగా రేవంత్‌రెడ్డి కుట్రేననీ, ముమ్మాటికీ తెలంగాణ ద్రోహం చేయడమే అవుతుందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -