Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌

- Advertisement -

రూ.100 కోట్లతో అత్యాధునిక పరికరాలు
రాష్ట్ర స్ధాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం
క్షేత్రస్ధాయి వరకు అడ్వాన్స్‌డ్‌ వెదర్‌ స్టేషన్లు ఏర్పాటు : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్ధ ( డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగాన్ని బలోపేతం చేసి దేశానికి ఒక రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా రూ.వంద కోట్లతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించి బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో విపత్తుల నిర్వహణా విభాగం, ఫైర్‌ సర్వీసెస్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, హైడ్రా, ఐసీసీసీ విభాగాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి పరికరాలను కొనుగోలు చేయాలన్న విషయంపై చర్చించారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించడానికి ఖచ్చితమైన సమాచార వ్యవస్థ, రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్‌ ఆధారిత కమ్యూనికేషన్‌, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్‌ , సెర్చ్‌ ఆపరేషన్ల సాంకేతికతను రెవెన్యూువిపత్తు నిర్వహణ విభాగాలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.

విపత్తు విభాగంలో పనిచేసేవారికి శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్ధాయిలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో అత్యుత్తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే వాతావరణ పరిస్ధితులు క్షేత్రస్ధాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా ఆయా స్ధానిక పరిస్దితులను బట్టి మండల స్ధాయి వరకు అడ్వాన్సుడ్‌ వెదర్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. భారీ వర్షాలు వరదల సమయంలో వాగుల్లో వంకల్లో చెరువుల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి ఎయిర్‌లిఫ్ట్‌ మెకానిజం తయారు చేసుకోవాలని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి 70 నుంచి 80 కిలోల బరువును ఎత్తే డ్రోన్లను కొనుగోలు చేయాలని సూచించారు. ఎయిర్‌ లిఫ్ట్‌ వ్యవస్ధ సరిగాలేకపోవడం వల్ల 2024లో పాలేరు నియోజవకర్గంలో వాగుల్లో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయానని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడడానికి వీలుగా సిమ్‌ ఆధారిత విహెచ్‌ఎఫ్‌ రేడియో సిస్టమ్‌లను అందుబాటులోకి తేవాలని సూచించారు. ఇప్పటికే ఈ వ్యవస్ధ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వ్యవస్దను క్షేత్రస్ధాయి వరకు తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే హైదరాబాద్‌ నగరంలో హైరైజ్డ్‌ భవనాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని సమర్దవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు. 77 హైస్పీడ్‌ బోట్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 12 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయని, ఒక్కో బృందంలో వెయ్యిమంది వరకు ఉన్నారని వీరందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, అగ్పిమాపకశాఖ డైరెక్టర్‌ విక్రమాన్‌ సింగ్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌, ఐసీసీసీ డైరెక్టర్‌ కమల్‌హాసన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి ఆరా
మేడారం మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో అత్యంత పవిత్రమైన మొదటి ఘట్టం బుధవారం ప్రారంభమైన నేపధ్యంలో సచివాలయం నుండి హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీతో మేడారంలో ట్రాఫిక్‌ విధులను పర్యవేక్షిస్తున్న సిబ్బందితో మంత్రి మాట్లాడారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరీక్షించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -