నవతెలంగాణ శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని కాచాపూర్, రాజాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాచాపూర్ మాజీ సర్పంచ్ గట్టు తిరుపతిగౌడ్ చూసి చలించిపోయారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు గుంతలమయమైన ఈ రోడ్డుపై పడుతున్న కష్టాలు ఆయన్ని కలచివేశాయి. గత కొద్ది రోజులుగా కన్నపూర్ నుండి రాజాపూర్ వరకు బస్సులు నిలిచిపోవడంతో, ఈ రెండు గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తిరుపతిగౌడ్ దృష్టికి రాగానే వెంటనే స్పందించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతులకు పూనుకున్నారు.
బుధవారం ఉదయం నుంచే తిరుపతిగౌడ్ పర్యవేక్షణలో రోడ్డుపై మట్టిని పోయించి, పెద్దపెద్ద గుంతలను పూడ్చివేసే పనులు ప్రారంభించారు. ఈ తక్షణ సాయంతో దశాబ్దాలుగా ఉన్న రోడ్డు సమస్యకు తాత్కాలికంగానైనా ఉపశమనం లభించిందని, తిరుపతిగౌడ్ చూపిన మానవత్వం, సేవా తత్పరతను స్థానికులు ఎంతగానో అభినందిస్తున్నారు. ఆయన చొరవతో త్వరలోనే బస్సులు తిరిగి నడిచి, ప్రజల రాకపోకల కష్టాలు తీరనున్నాయని స్థానికులు హార్షం వ్యక్తం చేశారు.