Thursday, December 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు

పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు

- Advertisement -

పట్టుబడిన మద్యం, డబ్బులు
పంపిణీ చేస్తున్న వారిపై కేసులు


నవతెలంగాణ-విలేకరులు
గ్రామపంచాయతీల తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పలుచోట్ల మద్యం, డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో వారిపై కేసులు నమోదయ్యాయి. అలాగే, ప్రచారం ముగిసినా రాత్రివేళల్లో సైలెంట్‌ సమయంలో ప్రచారం చేస్తున్నవారిపైనా కేసులో నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలంలో సర్పంచ్‌, వార్డుల అభ్యర్థులు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, ఎస్‌ఎఫ్‌టి టీం తనిఖీలు నిర్వహించారు.

భిక్కనూర్‌ పట్టణ కేంద్రంలో రింగు గుర్తు నుంచి సర్పంచ్‌ అభ్యర్థికి సంబంధించిన అనుచరులు సుభాష్‌గల్లీలోని వాణి నవశక్తి బీడీ కార్ఖానాలో డబ్బులు పంచుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.39 వేలు, జెండా గల్లీలో కత్తెర గుర్తు సర్పంచ్‌ అభ్యర్థికి సంబంధించిన అనుచరుల నుంచి 55 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నాయి బ్రాహ్మణ సంఘం గల్లీలో ఐదోవార్డు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మద్యం బాటిళ్లు, తన గుర్తుకు సంబంధించిన వస్తువులను ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓటర్లకు పంపిణీ చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని నగదు, మద్యం బాటిళ్లు, వస్తువులను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆయా వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

సైలెన్స్‌ పీరియడ్‌లో ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి సమయంలో సైలెన్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సీఐ అంజమ్మ తెలిపారు. ఇంటి ఆవరణలో 50 మందితో కలిసి సర్పంచ్‌ అభ్యర్థి మధుకర్‌ ప్రచారం నిర్వహిస్తుండగా ఎఫ్‌ఎస్‌టీ టీం తనిఖీ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అలాగే, నార్నూర్‌ మండల కేంద్రంలోని ముస్లింవాడ పరిసరాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఆడె సురేష్‌ను సీఐ అంజమ్మ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద రెండు వందల రూపాయల నోట్లు పదివేలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వింజపల్లి, వెంకటేశ్వరపల్లి గ్రామాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం తరలిస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి వెంకటేశ్వరపల్లి గ్రామంలో మద్యం నిల్వ ఉంచినట్టు విశ్వసనీయ సమాచారం మేరకు షేక్‌ షరీఫ్‌, షేక్‌ అక్బర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేస్తుండగా వింజపల్లికి చెందిన కుమార్‌, శివరామకృష్ణ, స్వామి, మహేష్‌, జీవన్‌రెడ్డి మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట శివారులో 48 మద్యం బాటిళ్లను ప్లయింగ్‌ స్క్వాడ్‌ ఆధ్వర్యంలో పట్టుకుని పోలీసు స్టేషన్‌లో అప్పజెప్పారు.

విధుల్లో నిర్లక్ష్యం.. అధికారుల సస్పెండ్‌
విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్‌ చేస్తూ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దౌల్తాబాద్‌, బషీరాబాద్‌, పెద్దముల్‌, కుల్కచర్ల మండలాలకు చెందిన అధికారులను ప్రిసైడింగ్‌ అధికారులుగా నియమించారు. వీరు విధులకు గైర్హాజరు కావడంతో సస్పెండ్‌ చేశారు. దౌల్తాబాద్‌ మండలానికి చెందిన 14 మందిని, కుల్కచర్ల మండలానికి చెందిన ఇద్దరిని, పెద్దేముల్‌ మండలానికి చెందిన ఒకరిని సస్పెండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -