Sunday, March 29, 2026
E-PAPER
Homeహెల్త్ఫలితాల మధ్యలో చిక్కుకున్న పసి మనసులు

ఫలితాల మధ్యలో చిక్కుకున్న పసి మనసులు

- Advertisement -

పరీక్షలు పూర్తయ్యాయి. పుస్తకాలు మూసివేయబడ్డాయి. కానీ చాలా మంది విద్యార్థుల మనసులు మాత్రం ఇంకా పరీక్షల హాల్లోనే తిరుగుతున్నాయి. ”ఎన్ని మార్కులు వస్తాయో?”, ”రాంక్‌ ఎలా ఉంటుంది?”, ”ఇంట్లో వాళ్లు ఏమంటారో?” అనే ప్రశ్నలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం ఉంది. మనిషి మెదడు అనిశ్చితిని తట్టుకోలేకపోతుంది. ఫలితాలు ఇంకా రాకపోవడం అంటే ‘తెలియని భవిష్యత్తు’. అనిశ్చితి, భయం, ఒత్తిడిగా మారుతుంది. ఆ ఒత్తిడి వల్ల విద్యార్థులు ”ప్రస్తుతాన్ని” పూర్తిగా మర్చిపోతారు.

గతాన్ని మార్చలేం, భవిష్యత్తు ఊహ మాత్రమే. పరీక్ష అనేది ఇప్పుడు గతం. అది చరిత్ర. దానిలో ఎలాంటి మార్పు చేయలేం. కానీ చాలా మంది విద్యార్థులు మళ్లీ మళ్లీ అదే ప్రశ్నలు తలచుకుంటూ, తాము తప్పు చేశామా లేదా అనే ఆలోచనలో పడిపోతారు. దీనిని ఆలోచనను తిరిగి తిరిగి తలచుకోవడం అంటారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, ఆందోళనను పెంచుతుంది.

ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని కోల్పోవడం
పరీక్షలు ముగిసిన తర్వాత ఉండే సమయం చాలా విలువైనది. ఇది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, మనసును రిఫ్రెష్‌ చేసుకోవడానికి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉత్తమ సమయం.
కానీ ఫలితాల ఆలోచనలో మునిగిపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.
రామ్‌ అనే విద్యార్థి పరీక్షలు బాగానే రాసాడు. కానీ ఫలితాల గురించి రోజూ టెన్షన్‌ పడుతూ, కొత్తగా ఏమీ నేర్చుకోలేదు.
ఇంకా సాయి అనే విద్యార్థి అదే పరిస్థితిలో ఉండి, కంప్యూటర్‌ కోర్సు నేర్చుకున్నాడు, ఫిట్‌నెస్‌పై దష్టి పెట్టాడు.
ఫలితాలు వచ్చినప్పుడు ఇద్దరికీ సమాన మార్కులు వచ్చాయి. కానీ సాయి మాత్రం రెండు అడుగులు ముందుకు వెళ్లిపోయాడు.
ఈజీ గోయింగ్‌ జీవితం ప్రమాదకరమైన మార్పు.
పరీక్షల తర్వాత చాలా మంది ”ఇప్పుడేమో రిలాక్స్‌ టైమ్‌” అని భావించి పూర్తిగా ఈజీ గోయింగ్‌ లైఫ్‌కి అలవాటు పడిపోతారు.
ఈ అలవాటు ఒక సమస్యను తీసుకువస్తుంది. ”ªlow frustration tolerance” చిన్న నిరాశను కూడా తట్టుకోలేకపోవడం.
ఫలితాలు ఆశించిన విధంగా రాకపోతే, విద్యార్థులు ఆ షాక్‌ ను తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది ఒక్కసారిగా జరిగేది కాదు. ఇది మెల్లగా పెరిగిన మానసిక బలహీనత ఫలితం.

సామాజిక ఒత్తిడి మరో ప్రధాన కారణం
”ఎంత మార్కులు?”, ”పక్కింటి.. ఎదురింటి ..స్నేహితులకు ఎంత వచ్చాయి?” వంటి ప్రశ్నలు విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి.
విద్యార్థులు తమ విలువను మార్కులతో కొలవడం ప్రారంభిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన మైండ్‌సెట్‌.
మానసిక దక్పథంలో మార్పు
ఈ సమస్యకు ప్రధాన పరిష్కారం ”ప్రస్తుతంపై దృష్టి” పెట్టడం.
పరీక్షలు ముగిసిన తర్వాత కొత్త పనిని ప్రారంభించాలి. ఫలితాల గురించి ఆలోచించడానికి ఒక సమయం మాత్రమే నిర్ణయించుకోవాలి. రోజువారీ రొటీన్‌ను కొనసాగించాలి. శారీరక వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లు పెంచుకోవాలి. ముఖ్యంగా మార్కులు జీవితం కాదు అని అర్థం చేసుకోవాలి.
గతం మన చేతుల్లో లేదు. భవిష్యత్తు ఇంకా రాలేదు. కానీ ప్రస్తుతం మాత్రం మన నియంత్రణలో ఉంది. ప్రస్తుతం విలువను గుర్తించకపోతే, మనమే మన అవకాశాలను కోల్పోతాం. ఫలితాలు మన భవిష్యత్తును నిర్ణయించవు. మన ఆలోచన విధానం నిర్ణయిస్తుంది.
పల్లె టూర్లు జీవితాన్ని నేర్పించే క్లాస్‌రూమ్‌
పరీక్షలు ముగిసిన తర్వాత పిల్లలను ఇంట్లోనే ఉంచడం కాకుండా, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఇళ్లకు, బంధువుల వద్దకు లేదా పల్లె టూర్లకు పంపించడం చాలా ఉపయోగకరం.
ఇది కేవలం సరదా కోసం కాదు. ఇది ఒక గొప్ప సైకాలజికల్‌ లెర్నింగ్‌ ప్రాసెస్‌.
పల్లెల్లో జీవితం సాదాసీదాగా ఉంటుంది. అక్కడ పిల్లలు సహజంగా కొన్ని విలువలను నేర్చుకుంటారు. సహనం (Patience), సరిపెట్టుకోవడం (Adjustment), సంబంధాల విలువ (Emotional bonding), ప్రకతితో అనుబంధం వల్ల మానసిక బలం పెరుగుతుంది.
కొత్త వాతావరణం మన మెదడును మరింత చురుకుగా చేస్తుంది. పిల్లలు కొత్త మనుషులను కలుస్తారు, కొత్త పరిస్థితులను ఎదుర్కొంటారు.
నగరంలో ఎప్పుడూ సౌకర్యాల్లో పెరిగి ఉంటారు. కానీ పల్లెలోకి వెళ్లినప్పుడు తక్కువ సౌకర్యాల్లో జీవించడం, పెద్దలతో గడపడం, చిన్న చిన్న పనులు చేయడం… ఇవన్నీ పిల్లల్లో ”resilience’ (ఎదుర్కొనే శక్తి) పెంచుతాయి.
జీవితం నేర్పే పాఠాలు
పుస్తకాలు మార్కులు ఇస్తాయి. కానీ అనుభవాలు జీవించడాన్ని నేర్పుతాయి.
అమ్మమ్మ కథలు, తాతయ్య సలహాలు, గ్రామ జీవన శైలి.. ఇవన్నీ పిల్లలలో భావోద్వేగ పరిపక్వతను పెంచుతాయి.
భవిష్యత్తుకు బలమైన పునాది
ఈ అనుభవాలు పిల్లలకు ఒక ముఖ్యమైన మానసిక బలాన్ని ఇస్తాయి.
”ఏ పరిస్థితి వచ్చినా నేను తట్టుకోగలను” అనే నమ్మకం ఉన్నప్పుడు.. ఫలితాలపై భయం తగ్గుతుంది. అపజయాన్ని సులభంగా స్వీకరిస్తారు. ఆత్మహత్య వంటి ఆలోచనలు తగ్గిపోతాయి
”పిల్లలకు సెలవులు ఇవ్వడం కాదు… జీవితాన్ని నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వాలి.”

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -