Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణిలో టెండర్ల దందా బట్టబయలు

సింగరేణిలో టెండర్ల దందా బట్టబయలు

- Advertisement -

– నెగెటివ్‌ బిడ్‌తో బయటపడ్డ కాంగ్రెస్‌ అసలు రంగు
– సింగరేణి లాభాలకు గండి… కార్మికుల బోనస్‌కు కోత పెట్టే కుట్ర : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సింగరేణిలో టెండర్ల దందా బట్టబయలైందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పోరాటంతో కాంగ్రెస్‌ సిండికేట్‌ బద్ధలైందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -12 శాతం నెగెటివ్‌ బిడ్‌తో కాంగ్రెస్‌ అసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. కమీషన్ల కోసమే శ్రీరాంపూర్‌ టెండర్‌ ఫైనాన్షియల్‌ బిడ్‌ను ఏడుసార్లు వాయిదా వేసినట్టు బీఆర్‌ఎస్‌ ముందే చెప్పిందని గుర్తు చేశారు. గతంలో సిండికేట్‌ కుమ్మక్కుతో +10 శాతం అదనంగా ప్రజాధనం దోపిడీకి గురైందనీ, ఇప్పుడు -12 శాతానికి టెండర్‌ వచ్చిందని తెలిపారు. ఓబీ పనుల్లో జాప్యంతో బొగ్గు ఉత్పత్తి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్‌లో కరెంటు కొనుగోలు చేస్తూ ప్రజల నెత్తిన చార్జీల భారం మోపుతున్నదని విమర్శించారు. సింగరేణి లాభాలకు గండి కొడుతూ కార్మికులు బోనస్‌కు కోత పెట్టే కుట్రను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆస్తి అయిన సింగరేణిని రాజకీయ కమీషన్లకు అడ్డాగా మార్చితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కొత్త నిబంధనలు తెచ్చాక సింగరేణిలో నమోదైన తొలి నెగెటివ్‌ బిడ్‌ ఇదేనని తెలిపారు. ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్‌రెడ్డి సిండికేట్‌ను బద్దలు కొడితే అసలైన పోటీ ఎలా ఉంటుందో, ధరలు ఎలా దిగి వస్తాయో ఈ ఒక్క టెండర్‌ నిరూపించిందని వివరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకుల వాటాల కోసం, ముఖ్యమంత్రి బంధువుల కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ సంపదను కాపాడే విధంగా పనిచేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి టెండర్లలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. అవినీతికి ఆస్కారం ఇస్తున్న సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరిగిన కాంట్రాక్టర్ల సిండికేట్‌ భాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -