పోలవరం ముంపుపై మళ్లీ సర్వే
‘అథారిటీ’ సమావేశంలో నిర్ణయం
పునరావాసం తీరుపై అసంతృప్తి
రాజమండ్రికి పోలవరం అథారిటీ కార్యాలయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారీకి గుంటూరు ఇరిగేషన్ అధికారులు పిలిచిన టెండర్లు రద్దయ్యాయి. ఎవరూ టెండర్లు దాఖలు చేయలకపోవడంతో ఇ-ప్రొక్యూర్‌మెంట్ సైట్లో అవి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయినట్టు పోలవరం ‘అథారిటీ’ సమావేశంలో నిర్ణయించి నట్టు అధికారులు తెలిపారు. గతనెల 31నే టెండర్ల కాలపరిమితి ముగిసిందని వారు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు సంబంధించి మరోసారి సర్వే చేయాలని పోలవరం అథారిటీ సమావేశం నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో నిర్ణయించిన మేరకు సిడబ్ల్యుసి ఆధ్వర్యాన ఈ సర్వేను నిర్వహించాలని అథారిటీ ఛైర్మన్ అతుల్‌జైన్ ఆదేశించారు. ప్రాజెక్టు నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం పట్ల, పునరావాస పనులు జరుగుతున్న తీరుపట్ల అథారిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మళ్లించిన నిధులను పోలవరం ప్రాజెక్టు ఖాతాలో జమ చేయాలని, పునరావాస పనులను వేగంగా పూర్తి చేయాలని పేర్కొంది.
డయాఫ్రం వాల్ పనులను 2026 మార్చి నాటికి, ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేయాలని నిర్దేశిం చింది. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు అథారిటీ అంగీకరిం చలేదు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలిం చాలని కూడా సమావేశం లో నిర్ణయించారు. అంతకుముందు కిన్నెర సాని, ముర్రేడు, మణుగూరు భార జలవిద్యుత్ కేంద్రం ముంపునకు గురవుతున్నాయని తెలంగాణా అధికారులు అథారిటీలో ప్రస్తావిం చారు. తాము 41.15 మీటర్ల పరిధికే ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ముంపు సమస్య రాదని ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. అయితే, అంతే ఎత్తులో ఉన్న చత్తీస్‌ఘడ్‌కు సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో తమకు కూడా నిర్వహించాలని తెలంగాణ అధికారులు చేసిన విజ్ఞప్తికి అథారిటీ సానుకూలంగా స్పందించింది. పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని తెలంగాణ అధికారులు ప్రస్తావించగా పోలవరం అథారిటీకి సంబంధంలేని అంశమని, ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదని ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు.



