Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం4న ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌వింగ్‌కు టెండర్లు

4న ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌వింగ్‌కు టెండర్లు

- Advertisement -

డిసెంబరులోగా ప్రక్రియ పూర్తి
జనవరిలో నిర్మాణ పనులకు శ్రీకారం
పూర్తికాని భూసేకరణ ! ?

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పరిపాలనా ప్రక్రియ కొనసాగుతున్నది. అధికారికంగా రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వస్తున్నది. కేంద్ర, రాష్ట్రాల మద్య భిన్నాభిప్రాయాలు, భూసేకరణ సమస్యలు, రైతులు, ఇతరులకు పరిహారం ఇచ్చే విషయమై ఎన్‌హెచ్‌ఏఐ మొండిగా వ్యవహరించడం, నిర్మాణ ఖర్చు విషయంలోనూ తేడాల మూలంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌వింగ్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. ఇప్పటికే నాలుగు సార్లు టెండర్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం జరిగితే దేశంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డుకెక్క నుంది. కోటగోడను తలపించేలా 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. ఉత్తర భాగంలో ప్రతి అరకిలోమీటరు ఒక బ్రిడ్జీ రానుంది. పలు ఇంటర్‌చేంజర్లు అవసరం కానున్నాయి. పాదచారులు దాటి వచ్చే అండర్‌పాసులు సైతం 3.5 మీటర్ల ఎత్తు నుంచి నాలుగు మీటర్ల ఎత్తుకు పెంచారు. ఏడాదిన్నర కిందటే ఈపనులకు సంబందించి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే వర్కింగ్‌ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ముందుకు రాలేదు. సాంకేతిక, ఆర్థిక బిడ్లు సైతం పూర్తిస్థాయిలో వేయడం లేదు. కాంట్రాక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు.

నాలుగున టెండర్లు
ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి నవంబరు నాలుగున టెండర్లు పిలవనున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. మొత్తం ప్రక్రియ డిసెంబరులోగా పూర్తికానుంది. కాగా 2026 జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభించాలని భావిస్తున్నది. 2027 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఏఐ తోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం డీపీఆర్‌ , భూసేకరణ సైతం కొలిక్కి వస్తున్న దశలో నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు పెంచారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది. ఉత్తర భాగానికి కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చనుంది. భూసేకరణ 98 శాతం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.

కాగా భూసేకరణ పూర్తిస్థాయిలో కాలేదు. రైతుల ఆందోళనలు ఆయా జిల్లాలో ్లకొనసాగుతున్నాయి. కోర్టుకుసైతం పోతున్నారు. అలాగే అరు వరుసలుగా మారడంలో ఇప్పుడు అలైన్‌మెంటులోనూ మార్పులు రానున్నాయి. నార్త్‌ వింగ్‌ సంగారెడ్డి, నర్సాపూర్‌, తుఫ్రాన్‌, గజ్వేల్‌, భువనగిరి, చౌటుప్పల్‌ గుండా వెళుతుంది. సుమారు.161.5 కిలోమీటర్లు. ఉత్తర భాగానికి రూ. 15 వేల కోట్లు అవనుండగా, ఈ మొత్తం కేంద్రమే భరించాల్సి ఉంది. భూసేకరణకు రెండు ప్రభుత్వాలు వ్యయం చేయాల్సి ఉంది. దక్షిణ భాగం చౌటుప్పల్‌, చేవెళ్ల ద్వారా సంగారెడ్డికి తిరిగి అనుసంధానిస్తారు.దీనికి సంబంధించి డీపీఆర్‌, భూసేకరణ తొలి దశలోనే ఉంది.

సమస్యలు..
ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి డీపీఆర్‌ పూర్తయిన వెంటనే కేంద్రం ఆమోదించకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. ఖర్చును ఎవరు భరించాలనే విషయమై ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఇందుకు కారణం. చివరకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం గ్రిన్‌సిగల్‌ ఇచ్చింది. ఈలోపు జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. భూముల ధరలు పెరగడంతో రైతులకు న్యాయంగా పరిహారం ఇచ్చే ప్రక్రియ వేగంగా సాగడం లేదు. దీంతో భూములు ఇవ్వడానికి అంగీకరించిన వారంతా కోర్టుకు వెళుతున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పట్టించుకోవడం లేదు. సాంకేతిక బిడ్లు ఓకే అవుతున్నా, ఆర్థిక బిడ్ల విషయంలో కాంట్రాక్టర్లు వెనకడుగేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తేనే వేగంగా నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -