Wednesday, October 15, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత

చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవితను అడ్డుకున్న పోలీసులు
గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు.. పలువురి అరెస్ట్‌
గత ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేశాయి
అందుకే ప్రతిపక్షంలో ఉన్నాయి : కవిత

నవతెలంగాణ – ముషీరాబాద్‌
హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రర్‌ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగ సమస్యపై చర్చించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత మంగళవారం సిటీ సెంట్రర్‌ లైబ్రరీ వద్దకు వచ్చారు. ముందే విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె లైబ్రరీలోనికి ప్రవేశించకుండా గేటుకు తాళం వేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కవిత వెంట వచ్చిన జాగృతి నాయకులు గేటు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం అక్కడ విద్యార్థులతో కలిసి కవిత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేశాయి కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. విద్యార్థులతో ప్రశాంతంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడానికి వస్తే పోలీసులు ఉద్రిక్త పరిస్థితి సృష్టించారని అన్నారు.

లైబ్రరీ గేటులోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని, లోనికి ప్రవేశించినా లైబ్రరీలోకి వెళ్లకుండా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 అవకతవకలపై కోర్టులో విచారణ జరగనుందని, సింగిల్‌ జడ్జిమెంట్‌ ఏదైనా, అందుకు కట్టుబడి ఉండాలని కవిత కోరారు. తెలుగు భాషలో పరీక్ష రాసిన విద్యార్థులు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. నష్టపోయిన వారిలో పోలీసుల పిల్లలు కూడా చాలామంది ఉన్నారని, తమరు ప్రభుత్వానికి వత్తాసు పలకడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని, అటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా రక్షిస్తారని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలకు పాత నోటిఫికేషన్‌ ఇచ్చిందని, కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని తెలిపారు. వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. డివిజన్‌ బెంచ్‌లో విద్యార్థులకనుగుణంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు వరకు విద్యార్థుల వెంటే ఉండి నడుస్తామన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా గ్రూప్‌-1ను రద్దు చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -