లాల్‌గడి మలక్‌పేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ప్రచార రథం డీజే సౌండ్ తగ్గించమన్నందుకు వివాదం
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు అద్దం ధ్వంసం
నవతెలంగాణ-శామీర్‌పేట
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గడి మలక్‌పేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ ప్రచార రథం డీజే సౌండ్ తగ్గించాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు కోరిన నేపథ్యంలో వివాదం చెలరేగి, పరస్పర దాడులకు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ప్రచారం ముగించుకుని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేటకు చేరుకుని అక్కడ మాజీ సర్పంచ్ చీదు శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ ప్రచార రథం పెద్దఎత్తున డీజే సౌండ్ వినిపించింది. సమావేశం జరుగుతుండటంతో సౌండ్ తగ్గించాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేయగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోలేదని బీఆర్‌ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
దాంతో సౌండ్ తగ్గించకపోవడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు రథం వైర్ కనెక్షన్ తొలగించారు. దాంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరు గ్రూపుల వారిని చెదరగొట్టి గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సమాచారం అందుకున్న డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన రౌడీలను గ్రామం నుంచి పంపించాలని, మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతోనే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
తాము ఇంట్లో సమావేశం నిర్వహిస్తుండగా ప్రచార రథంతో వచ్చి కావాలనే పెద్ద సౌండ్ పెట్టారని, సౌండ్ తగ్గించాలని కోరినా వినిపించుకోలేదని అన్నారు. అనంతరం తమ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, తమను హత్య చేయాలని కూడా ప్రయత్నించారని ఆరోపించారు. గన్‌మెన్‌లు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రచార రథం వైర్లు ఎందుకు తీసేశారని అడిగినందుకు మల్లారెడ్డి వెంట వచ్చిన మల్కాజిగిరికి చెందిన రౌడీలు కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలపై దాడి చేశారని ఆరోపించారు. నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచార రథం తిరగకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మల్కాజిగిరి నుంచి వచ్చిన వారందరిపై పోలీస్ కేసులు ఉన్నాయని, వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ నాయకులు రౌడీయిజానికి పాల్పడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం ఉన్నా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు ఎవరు దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు.



