లక్ష్మిప్రసన్న బంధువుల రాస్తారోకో
– పోలీస్ వాహనంలో మృతురాలి భర్త నరేష్, బావ శ్రీను
– రెండేండ్ల నుంచి మాట్లాడనివ్వలేదు : మృతురాలి తల్లిదండ్రులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో అనుమానాస్పదంగా మృతిచెందిన వివాహిత లక్ష్మిప్రసన్న కేసు.. సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను అల్లుడు నరేష్ హత్య చేశాడంటూ.. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు.. అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. నరేష్‌బాబును అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందిన లక్ష్మి ప్రసన్న మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలానికి అంబులెన్స్‌లో తరలిస్తున్న విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు అధికసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కొంతమంది యువకులు స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలిలో అంబులెన్స్ ఆపి.. అందులో ఉన్న మృతురాలి భర్త నరేష్‌బాబుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు వారించినా ఆగకుండా భౌతికంగా దాడికి దిగారు. దాంతో నరేష్ బాబు, అతని బావ దాసరి శ్రీనుని పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కాగా, పోలీస్ వాహనాన్ని నిందితుని బావ శ్రీను నడపడం చూసిన మృతురాలి బంధువులు ఒక్కసారిగా ఉద్వేగానికి గురై నిందితుడు పోలీస్ వాహనం నడపడం ఏమిటంటూ నిరసనకు దిగారు. దాంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తిత చోటుచేసుకుంది.
రెండేండ్ల నుంచి మాట్లాడనివ్వలేదు : మృతురాలి తల్లిదండ్రులు
‘వివాహ సమయంలో రెండెకరాల మామిడితోట, అర ఎకరం పొలంతో పాటు రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చాం. అశ్వారావుపేటకు వెళ్లిన ఏడాదిపాటు తమ కుమార్తె మాట్లాడేది. రెండేండ్ల నుంచి ఆమెను చూపించలేదు. ఫోన్ చేసినా మాట్లాడనివ్వలేదు. మేము వెళ్లినా ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పి పంపించేవారు. ఆమెను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా చంపేశారు. లక్ష్మీప్రసన్నను అదనపు కట్నం కోసం భర్త నరేష్ బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూ లక్ష్మి, బావ శ్రీనివాసరావు హింసించే వారు.’ అని లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నరేశ్‌బాబు బావ మాత్రం.. లక్ష్మీప్రసన్నకు రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయని, ఆమెను తల్లిదండ్రులకు చూపించ లేదనడం అవాస్తవమని అన్నారు.
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES