పురానాపూల్‌లోని ఓ ప్రార్థనా మందిరంలో ఫ్లెక్సీ, పీవోపీ విగ్రహం ధ్వంసం
అదుపు చేస్తున్న పోలీసులపై దాడి, నలుగురికి స్వల్ప గాయాలు
ప్రత్యేక అదనపు బలగాలతో బందోబస్తు
సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం : సజ్జనార్
నవతెలంగాణ – ధూల్‌పేట్
పాతబస్తీ పురాణాపూల్ దర్వాజాలో బుధవారం అర్ధరాత్రి ఓ ప్రార్థన మందిరంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి వరాండాలో ఉన్న ఫ్లెక్సీతో పాటు పీవోపీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన అనంతరం అక్కడ సుమారు 300 మంది గుమిగూడటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న కామాటిపురా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులపై దాడి చేశారు. నలుగురు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ సజ్జనార్, డీసీపీ, చార్మినార్ ఏసీపీ సహా ఉన్నతాధికారులు పరిశీలించారు. విగ్రహాలకు ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం వరాండాలోని ఫ్లెక్సీ, పీవోపీ విగ్రహం మాత్రమే దెబ్బతిన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
పురాణాపూల్ దర్వాజా పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
చార్మినార్, మక్కాలో ప్రశాంతంగా ప్రార్థనలు
ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం చార్మినార్, మక్కా మసీదుల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టగా, ఎలాంటి ఘటనలు లేకుండా ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి.



