కాల్వపల్లిలో జేసీబీతో ట్రంచ్ కొట్టేందుకు అటవీ అధికారుల యత్నం
గిరిజనులు, అధికారుల మధ్య ఘర్షణ
అడ్డుకొని ఆందోళనకు దిగిన రైతులు
వెనుదిరిగిన అధికారులు
నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామశివారులోని పోడుభూముల్లో అటవీ అధికారులు మంగళవారం జేసీబీతో ట్రంచ్ కొట్టేందుకు యత్నించగా గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఏండ్ల తరబడి తాము పోడు చేసుకుని జీవనం సాగిస్తున్నామనీ, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆందోళనకు దిగారు. దీంతో ఫారెస్టు అధికారులకు, పోడు రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాల్వపల్లి శివారు దూదేకులపల్లి రేంజ్ పరిధిలోని సింగారం బీట్ పరిధిలో ఛత్తీస్‌గఢ్ నుంచి వలసొచ్చిన గొత్తికోయలు, ఆదివాసీ గిరిజనులు సుమారు 160 ఎకరాల భూమిలో పోడు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.
మంగళవారం ఉదయం ఫారెస్ట్ అధికారులు రమేష్, సీతారాంనాయక్ ఆధ్వర్యంలో సుమారు 16మంది అటవీ సిబ్బంది జేసీబీ వాహనంతో పోడు భూమి చుట్టూ ట్రంచ్ కొట్టేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోడు రైతులు, మహిళలు వెంటనే జేసీబీని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. గంటపాటు వారు అధికారులతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోడు భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడిన ఫారెస్ట్ బీట్ అధికారులు చేసేదేమీలేక వెనుదిరిగారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాము సాగుచేసుకుంటున్న భూముల జోలికి అటవీ అధికారులు రాకుండా చొరవ తీసుకోవాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.



