Friday, March 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపశ్చిమాసియాలో టెన్షన్‌

పశ్చిమాసియాలో టెన్షన్‌

- Advertisement -

చల్లారని యుద్ధ మంటలు
యూఎస్‌ ట్యాంకర్‌పై ఎటాక్‌తో ఇరాన్‌ ప్రతీకారం
తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ తీవ్ర ఆందోళన
మధ్యవర్తిత్వానికి సిద్ధం : చైనా
ఆరో రోజూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దాడులు.. ప్రతిదాడులు

టెహ్రాన్‌, వాషింగ్టన్‌ : మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు చల్లారటం లేదు. ఒకవైపు ఇజ్రాయిల్‌, అమెరికా దాడులు.. మరోవైపు ఇరాన్‌ ప్రతిదాడులతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవు తున్నాయి. ఆరో రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా ఇరాన్‌ ఇజ్రాయిల్‌ వైపు అనేక క్షిపణులను ప్రయోగించింది. అమెరికా యుద్ధనౌకపై ఇరాన్‌ దాడిచేసి ప్రతీకారం తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇజ్రాయిల్‌.. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌, బాసిజ్‌ యూనిట్లతో సహా ఇరాన్‌ అంతర్గత భద్రతా దళాలపై దాడి చేసింది. వాండెన్‌బర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి అమెరికా మినిట్‌మ్యాన్‌ 3 క్షిపణిని పరీక్షించింది. కువైట్‌లో మరణించిన ఇద్దరు సైనికులను పెంటగాన్‌ గుర్తించింది. కువైట్‌లో ట్యాంకర్‌ పేలుడు చమురు చిందటానికి కారణమైంది. ఖతార్‌ అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో నివాసితులను ఖాళీ చేయించింది. అమెరికా-ఇజ్రాయిల్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన సన్నాహాలు టెహ్రాన్‌లో జరుగుతున్నాయని నివేదికలు తెలిపాయి.

తాము మర్కబా సమీపంలోని ఇజ్రాయిల్‌ దళాలపై క్షిపణిదాడులు ప్రారంభించినట్టు హెజ్బొల్లా పేర్కొంది. లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ చేసిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. హిజ్బొల్లా టార్గెట్‌గా దాడులు జరపబోతున్నామనీ, ఇరాన్‌ అధికారులు లెబనాన్‌ను వీడాలంటూ అంతక ముందు ఇజ్రాయిల్‌ డెడ్‌లైన్‌ విధించింది. అయితే ఆ గడువు ముగిసిపోవడంతో ఇజ్రాయిల్‌ ఈ దాడులకు దిగింది. గురువారం తెల్లవారు జామున బీరుట్‌ పొరుగు ప్రాంతాలైన ఘోబెయిరీ, హరెట్‌ హ్రీక్‌లపై అనేక దాడులు జరిగాయని లెబనీస్‌ నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీ (ఎన్‌ఎన్‌ఏ) నివేదించింది. ఇక అరబ్‌ దేశాల్లో యూఎస్‌ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులను కొనసాగించింది. ఇరాక్‌లోని ఎర్బిల్‌లో యూఎస్‌ మిలిటరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్‌ ఆర్మీ డ్రోన్లను ప్రయోగించింది. అంతకముందు కూడా యూఎస్‌కు చెందిన పలు ఎయిర్‌బేస్‌లు, హౌటళ్లను టార్గెట్‌గా చేసుకొని ఇరాన్‌ పలు డ్రోన్లను ప్రయోగించి దాడులకు దిగింది. బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద యూఎస్‌ మిలిటరీ బేస్‌పై దాడికి యత్నించిన ఒక డ్రోన్‌ను నిర్మూలించినట్టు ఇరాక్‌ దళాలు వెల్లడించాయి.

అమెరికాపై ఇరాన్‌ ప్రతీకారం
హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌక ఐరిస్‌ దేనాపై అమెరికా దాడిచేసి, ముంచేసిన ఘటనకు ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంది. గల్ఫ్‌లోని యూఎస్‌ ట్యాంకర్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం.. పర్షియన్‌ గల్ఫ్‌లోని యూఎస్‌ ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేసినట్టు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. నౌక నుంచి భారీ మంటలు ఎగిసిపడ్డాయని వివరించింది. అయితే ప్రాణనష్టానికి సంబంధించి సమాచారం లేదు. కాగా తమ యుద్ధనౌకపై దాడికి ప్రతిస్పందన గానే ఈ దాడి జరిగిందని ఇరాన్‌ అధికారులు వివరించారు. అయితే ఇటు ఇరాన్‌ ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించలేదు. అటు అమెరికా కూడా దీనిపై ఇంకా స్పందించలేదు. కాగా తమ దేశ యుద్ధ నౌకపై అమెరికా చేసిన దాడిని అంతకముందు ఖండించిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ.. దీనికి తగిన బదులు తీర్చుకుంటామని కూడా హెచ్చరించిన విషయం విదితమే.

మీ అణుప్లాంట్‌ను టార్గెట్‌ చేసుకుంటాం : ఇజ్రాయిల్‌కు ఇరాన్‌ హెచ్చరికలు
అమెరికా-ఇజ్రాయిల్‌లు కలిసిచేస్తున్న దాడులు, హెచ్చరికలకు ఇరాన్‌ బలంగా బదులిస్తోంది. ఈ మేరకు ఆ రెండు దేశాలకు హెచ్చరికలు పంపుతోంది. తమ దేశంలో పాలన మార్పునకు ప్రయత్నించొద్దని ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది. ఒకవేళ అలా చేస్తే ఇజ్రాయిల్‌లోని డిమోనా అణుప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఇరాన్‌లో పాలకులు మారేవరకూ అమెరికా యుద్ధం కొనసాగిస్తుందని ఇజ్రాయిల్‌ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా ఇరాన్‌ తాజా హెచ్చరికలు పంపింది.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఈ మార్గం ద్వారా చమురు సరఫరాలో 20 శాతం రవాణా జరుగుతుంది. అయితే దీని ప్రభావం భారత్‌ వంటి దేశాలపైనా పడే అవకాశం ఉంది. ఇక ఇరాన్‌ సరిహద్దుల్లో కొత్త సైనిక కదలికలు జరుగుతున్నాయి. కొన్ని కుర్దిష్‌ తిరుగుబాటు గ్రూపులు కూడా ఈ యుద్ధంలో భాగం కావొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. దీనితో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌ఓ తీవ్ర ఆందోళన
అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్దోన్మాదంతో అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్‌లోని ఆరోగ్య మౌలిక సదుపాయాలపై 13 దాడులు, లెబనాన్‌లో ఒక జరిగాయనీ, ఈ దాడుల్లో నలుగురు ఆరోగ్య సంరక్షణ కార్మికులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. 25 మందికి గాయాలైనట్టు వివరించింది. మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో దాదాపు వెయ్యి మంది, లెబనాన్‌లో 50 మంది, ఇజ్రాయిల్‌లో 13 మంది, గల్ఫ్‌ దేశాల్లో 11 మంది చనిపోయినట్టు వివరించారు. అంతర్జాతీయ మానవ చట్టాల కింద ఆరోగ్యరంగాన్ని రక్షించాలనీ, దానిని టార్గెట్‌గా చేసుకోవద్దని డబ్ల్యూహెచ్‌ఓ నొక్కి చెప్పింది. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది గాయాలపాలైనట్టు, కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు కూడా దాడులకు గురైనట్టు మానవ హక్కుల సంస్థలు తెలిపాయి.

మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా
మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం, దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు అవసరమైతే రెండు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి.. గల్ఫ్‌ దేశాధినేతలతో ఫోన్‌లో చర్చలు జరిపారని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్‌ జియాన్‌ వెల్లడించారు. యూఏఈ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ సహ్యాన్‌ సహా పలువురు నేతలతో మాట్లాడినట్టు తెలిపారు. అలాగే రష్యా, ఒమన్‌, ఫ్రాన్స్‌, ఇరాన్‌, ఇజ్రాయిల్‌తో కూడా చర్చించినట్టు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -