Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజనగామలో మంత్రి సీతక్క పర్యటనలో ఉద్రిక్తత

జనగామలో మంత్రి సీతక్క పర్యటనలో ఉద్రిక్తత

- Advertisement -

కాంగ్రెస్‌ – బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య తోపులాట
కొబ్బరికాయ కొట్టే విషయంలో వివాదం
రణరంగమైన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం
ఇరు గ్రూపులను చెదరగొట్టిన పోలీసులు

నవతెలంగాణ-జనగామ
మంత్రి సీతక్క జనగామ పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగింది. జనగామ మున్సిపల్‌ పరిధిలో శుక్రవారం చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణకు వేదికయ్యాయి. ఇరు గ్రూపుల పోటాపోటీ నినాదాలు, తోపులాటలు జరిగాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాలకుర్తి పర్యటన ముగించుకుని మంత్రి సీతక్క జనగామ శివారులోని పెంబర్తి బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాలను ఆవిష్కరించే క్రమంలో ఈ వివాదం చోటుచేసుకుంది. కొబ్బరికాయ కొట్టే సమయంలో, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌తో కొబ్బరికాయ కొట్టించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కోరారు.

దీన్ని కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇది పార్టీ కార్యక్రమం కాదు.. మాజీ కౌన్సిలర్‌ ఎలా కొబ్బరికాయ కొడతారు?’ అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌ రెడ్డి గురించి ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. ఈ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వాదులాడుకుంటూ తోపులాటకు దిగారు. ఈ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ‘జై కాంగ్రెస్‌’, ‘జై బీఆర్‌ఎస్‌’, ‘ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఎమ్మెల్యే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు విమర్శించగా, పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి ఇరు పార్టీ గ్రూపులను చెదరగొట్టారు.

అడుగడుగునా అదే పరిస్థితి…
అక్కడి నుంచి అంబేద్కర్‌ చౌరస్తాలో సూర్య నమస్కార విగ్రహాల ఆవిష్కరణ, నెహ్రూ పార్క్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ అభివృద్ధి పనులు, ఉదయ నిలయం వద్ద మోడల్‌ కూరగాయల మార్కెట్‌ ప్రారంభోత్సవం వద్ద కూడా ఇదే తరహా ఉద్రిక్తత కొనసాగింది. రణరంగంగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని స్థానికులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రిజ్వానా బాషా షేక్‌, అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లకావత్‌ ధనవంతి సహా రెండు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -