నవతెలంగాణ స్టేషన్ ఘన్‌పూర్: మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆదివారం మరో మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రఘునాథపల్లి మండలంలో పర్యటనకు సిద్ధమైన తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల వేళ అక్కడి వెళ్లడం మంచిది కాదని వారు సూచించారు. వారించినా.. వినకపోడంతో పోలీసులు రాజయ్యను గృహ నిర్భంధం చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆందోళనకు దిగడంతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి సిగ్గు శరం ఉంటే.. వరంగల్ గడ్డ పౌరుషం ఉంటే, మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోడానికి కూడా కడియంకు సిగ్గు లేదని.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాజీనామా చేయమని అని తిడుతున్న పట్టించకుకోవడం లేదని మండిపడ్డారు. కూతురు కోసం పార్టీ మారి ఏకంగా రూ.200 కోట్లకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అమ్ముడుపోయాడని రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరిపై వెంటనే అనర్హత వేటు చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు.