Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ఉద్రిక్తం

ఢిల్లీలో ఉద్రిక్తం

- Advertisement -

అర్ధరాత్రి 17 బుల్డోజర్లతో ఓ మసీదు వద్ద కూల్చివేతలు
నిర్మాణాల తొలగింపుపై స్థానికుల ఆగ్రహం
నిరసనకారులపై బాష్పవాయుగోళాలు ప్రయోగం
ఢిల్లీ హైకోర్టులో విచారణ కోనసాగుతున్నా ఆగని విధ్వంసకాండ
‘బుల్డోజరిజం’ అనాగరిక చర్య : సీపీఐ(ఎం)

న్యూఢిల్లీ : దేశరాజధాని న్యూఢిల్లీలో ఓ మసీదు వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం హింసాత్మకంగా మారింది. టర్క్‌మన్‌గేట్‌ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బుధవారం తెల్లవారు జామున సుమారు 1 గంటల ప్రాంతంలో దాదాపు 17 బుల్డోజర్లు, జేసీబీ యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. అమాంతంగా నిర్మాణాలను కూల్చారు. ఎంసీడీ ఆకస్మిక చర్యతో స్థానికులు, దుకాణదారులు ఆందోళనకు గురయ్యారు. అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఎంసీడీ అధికారుల చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. అధికారులు, పోలీసులు వారి మాట వినలేదు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. టియర్‌ గ్యాస్‌నూ ప్రయోగించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకున్నది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అక్కడ రాళ్లదాడి ఘటనలు చోటు చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్టు వివరించారు. భారీగా పోలీసుల మోహరింపు..ఎంసీడీ అధికారుల కూల్చివేతలు.. స్థానికుల నిరసనలతో అక్కడి ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది.

వివరాళ్లోకెళ్తే… రాంలీలా మైదానం సమీపంలో టర్క్‌మన్‌ గేట్‌ ప్రాంతంలో గల ఫైజ్‌-ఎ-ఇలాహి మసీదు వద్ద అక్రమ కట్టడాలను తొలగించేందుకు ఎంసీడీ అధికారులు బుధవారం భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. టర్క్‌మన్‌గేట్‌ ప్రాంతం అనేక దుకాణాలతో కూడుకున్న వాణిజ్య ప్రాంతం. కూల్చివేత డ్రైవ్‌లో భాగంగా సయ్యద్‌ ఇలాహి మసీదు పక్కన ఉన్న అన్ని నిర్మాణాలనూ తొలగించారు. కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే మసీదు బయట అక్కడి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఎంసీడీ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మసీదుకు వెళ్లే అన్ని దారులనూ బ్యారికేడ్లతో మూసివేశారు. మరిన్ని అల్లర్లు జరగకుండా అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ”కూల్చివేత డ్రైవ్‌ సజావుగా సాగేందుకు మొత్తం ప్రాంతాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు అదనపు డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాం” అని పోలీసులు చెప్పారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము కూల్చివేతలు చేపట్టినట్టు అధికారులు సమర్థించుకున్నారు. రాళ్ల దాడి సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారని అధికారులు తెలిపారు.

ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉండగానే..
ఈ కూల్చివేతల వ్యవహారంపై ఇప్పటికీ ఢిల్లీ హైకోర్టులో విచారణ నడుస్తున్నది. దీనిపై మంగళవారం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. టర్క్‌మన్‌గేట్‌లోని సయ్యద్‌ ఫైజ్‌-ఎ-ఇలాహీ మసీదు, సమాధి స్థలం పక్కనున్న భూమిపై అక్రమ కట్టడాల తొలగింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఎంసీడీ, ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు తదితర అధికారులు, అధికార యంత్రాంగాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందనలు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. ఇంతలోనే ఎంసీడీ అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌కు దిగడం గమనార్హం. గతేడాది నవంబర్‌ 12న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చివేతల కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఎంసీడీ ప్రకారం 0.195 ఎకరాల భూమిలో మాత్రమే మసీదు ఉన్నది. అయితే దాని బయట ఉన్న నిర్మాణాల విషయంలో ఓనర్షిప్‌(యాజమాన్యం)నకు సంబంధించి మసీదు నిర్వహణ కమిటీ లేదా ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలూ సమర్పించలేదని అంటున్నది.

‘బుల్డోజరిజం’ కొత్త రకమైన అనాగరిక చర్య : హన్నన్‌ మొల్లా
బుల్డోజరిజం ఒక కొత్త రకమైన అనాగరికత అని సీపీఐ(ఎం) నాయకుడు హన్నన్‌ మొల్లా అభివర్ణించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా జరిగినప్పుడల్లా బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా నేరం చేస్తే, మీరు వారి ఇల్లు లేదా నివాస స్థలాన్ని కూల్చివేయలేరు. బుల్డోజర్‌ అనాగరికత అనేది మోడీ ,బీజేపీ ప్రభుత్వపు కొత్త సహకారం,” అని అన్నారు.
ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ హన్నన్‌ మొల్లా, మసీదులు, దేవాలయాలు మరియు ఇతర పుణ్యక్షేత్రాలతో సహా భారతదేశం అంతటా ఆక్రమణలు ఒక సాధారణ సమస్య అని అన్నారు.

”ఆక్రమణకు గురైన భూముల్లో వేలాది దేవాలయాలు నిర్మించబడ్డాయి. మసీదుల విషయంలో, సరైన చట్టపరమైన పత్రాలు లేకుండా భూమిపై మసీదును నిర్మించకూడదనే నియమం ఉంది. అయినప్పటికీ, కొన్ని చోట్ల మసీదులను కూల్చివేస్తున్నారు,” అని ఆయన అన్నారు. ఆక్రమణకు గురైన భూముల్లో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని, అయితే నిష్పక్షిపాతంగా చర్యలు తీసుకోనప్పుడు ఈ సమస్య తలెత్తుతుందని ఆయన అన్నారు.
”మీరు చర్య తీసుకుంటున్నట్లయితే, అది వివక్ష లేకుండా జరగాలి. లేకపోతే, ప్రజలు సహజంగానే ప్రశ్నలు లేవనెత్తుతారు. ఆ భూమి తమదేనని ప్రభుత్వం వాదించవచ్చు, మరికొందరు అది వక్ఫ్‌ భూమి అని చెప్పవచ్చు. ఇలాంటి వివాదాలను సంభాషణలు , పరిపాలనా ప్రక్రియల ద్వారా పరిష్కరించాలి,” అని మొల్లా అన్నారు. దేశంలో మతపరమైన వివాదాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయని సీపీఐ(ఎం) నాయకుడు అన్నారు.

”ఇలాంటి పరిస్థితులలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర ఉంటుందని నేను నమ్ముతున్నాను. రాజకీయ పార్టీలు ఒక మతానికి లేదా మరొక మతానికి మద్దతు ఇవ్వవచ్చు. కానీ న్యాయవ్యవస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి,” అని ఆయన అన్నారు. తీర్పులు ఇచ్చేటప్పుడు మతపరమైన ఆచారాల వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన న్యాయవ్యవస్థను కోరారు.
”న్యాయబద్ధమైన నిర్ణయాలు ఉండాలి. దురదృష్టవశాత్తు, కొన్ని తీర్పుల కారణంగా న్యాయవ్యవస్థ కూడా సందేహంలో పడింది. గత 15 ఏండ్లుగా అనేక తీర్పులు వెలువడ్డాయి. కానీ చాలా మంది తమకు న్యాయం లేదని భావిస్తున్నారు, ”అని మొల్లా జోడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -