– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
– విద్యార్థులకు ధైర్యం
– గ్రామాభివృద్ధికి చర్యలు
– సేవా కార్యక్రమాలకు నివాళి
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యలో పదో తరగతి తొలి మెట్టు అని, పాఠశాల విద్యలో పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.
మండలంలోని మామిళ్లవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడిక అలవాటు చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ప్రసాదరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆసుపాక లో నూతన విద్యుత్ లైన్ల కు శంకుస్థాపన ఆసుపాక పంచాయతీ పరిధిలోని కొర్రివారి గుంపులో ఏర్పాటు చేయనున్న నూతన విద్యుత్ లైన్ పనులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకు వస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోడెం ఆదిలక్ష్మి, ఉప సర్పంచ్ భూక్యా మేఘ్యా, మాజీ సర్పంచ్ కునుసోతు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
వినాయకపురం పాఠశాలల సందర్శన :
మండలంలోని వినాయకపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అంశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు తెలిపిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నప్రాసన కార్యక్రమంలో ఎమ్మెల్యే :
స్థానిక శ్రీ సత్యసాయి కళ్యాణమండపంలో నిర్వహించిన డాక్టర్ సత్యవరపు జగదీష్ – లీలావతి దంపతుల మనవరాలు, (నిఖిలేష్ – భవాని దంపతుల కుమార్తె )సితార మీనాక్షి అన్నప్రాసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
అనసూయ సేవలు చిరస్మరణీయం :
నిరాశ్రయులు, అభాగ్యులకు సేవ చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన అనసూయ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట లో సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన “అమ్మ సేవా సధనం” నిర్వాహకురాలు అనసూయ దశదిన కర్మలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబం సభ్యులు తో పాటు యూఎస్ ప్రకాశ్ రావు,తాడేపల్లి రవి,కురిసెట్టి నాగబాబు నాయుడు లు పాల్గొన్నారు.



