అమెరికన్ విద్యాసంస్థల్లో ఉన్న విదేశీ విద్యార్థులంతా ఇప్పుడు చాలా భయపడి పోతున్నారు. వాళ్లని ఎత్తుకుపోవచ్చు లేదా వాళ్లుంటున్న ప్రదేశాలకు వందలాది మైళ్ల దూరంలో ఉండే నిర్బంధ కేంద్రాలకు వాళ్లని తరలించవచ్చు. అక్కడ ఎంతకాలమైనా నిర్బంధించవచ్చు, ఆ తర్వాత వాళ్లని వాళ్ల స్వదేశాలకు పంపేయవచ్చు. అక్కడి చట్టాలను ఉల్లంఘించినందుకు కాదు. కేవలం అక్కడి అధికారులు వాళ్లకి తోచినట్టు వ్యవహరించడమే కారణం. కచ్చితమైన అంచనాలు లేవు కాని కనీసం పదిహేను వందల మంది విద్యార్థులకు ఇప్పటిదాకా వీసాలు రద్దయ్యాయి. వారందరినీ త్వరలో వారి వారి దేశాలకు వెనక్కి పంపేయనున్నారు. ఆ విద్యార్థులలో ఎక్కువమంది ”యూదు వ్యతిరేకత”ను కనబరచినందుకుగాను వారిని లక్ష్యంగా చేసుకున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఈ ”యూదు వ్యతిరేకత” అంటే ఏమిటన్నది ఎవరు తేలుస్తారంటే అదంతా అక్కడి అధికారుల ఇష్టమే. ఏయే కార్య కలాపాలు ”యూదు వ్యతిరేకత”గా పరిగణించబడతాయో నిర్దేశించే నిబంధనలు కాని, పరిధులు కాని ఎక్కడా లేవు.టఫ్ట్స్ యూనివర్సిటీ అని ఒకటుంది. అక్కడి విద్యార్థులు ‘టఫ్ట్స్ డైలీ’ అనే పత్రికను నడుపుతారు. ఆ పత్రికలో ఇజ్రాయిల్ నుండి పెట్టుబడులను ఉపసంహరించాలని యూనివర్సిటీని కోరుతూ ఒక సంపాదకీయ వ్యాసం మరొకరితో కలిసి రాసినందుకు ఒక విద్యార్థిని లక్ష్యంగా చేసుకున్నారు. మరొక విద్యార్థికి ఒక బంధువు ఉన్నారు. ఆ బంధువు హమాస్‌కి సలహాదారుగా పనిచేశారు. ఒక దశాబ్దం కిందట ఆ పదవిని వదిలేశారు. పైగా 2023లో హమాస్ చేసిన దాడిని విమర్శించారు కూడా. అయినా సరే ఈ విద్యార్ధిని లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా విద్యార్థులను ఇక్కట్లపాలు చేయవచ్చు. విద్యార్థుల సోషల్ మీడియా పోస్టులన్నింటినీ ఇప్పుడు అక్కడ అధికారులు పరిశీలిస్తున్నారు. వాటిని బట్టి ఎవరిని ఎత్తుకుపోవచ్చు, ఎవరిని నిర్బంధించబచ్చు, ఎవరిని వారి స్వదేశాలకు తిప్పి పంపవచ్చు అన్నది నిర్ధారించనున్నారు. దాంతో భయపడిపోతున్న విద్యార్థులు వాళ్ల సోషల్ మీడియా పోస్టుల్ని డిలీట్ చేసే పనిలో పడ్డారు. ఇంతకూ ”యూదు వ్యతిరేకత”ను వ్యక్తం చేయడం అనేది చట్ట విరుద్ధం అని ఎక్కడా చెప్పలేదు. దానిపై చర్యలు తీసుకోవచ్చునని కూడా ఎక్కడా చెప్పలేదు. తాము లక్ష్యంగా చేసుకుని శిక్షిస్తున్న విద్యార్థులంతా అమెరికన్ విదేశాంగ విధానానికి విరుద్ధంగా పని చేస్తున్నారని మాత్రమే అధికారులు చెప్తున్నారు. అమెరికా ప్రపంచవ్యాప్తంగా యూదు వ్యతిరేకత అనేది లేకుండా చేయాలన్న లక్ష్యాన్ని కలిగివుంది. ఆ విధానాన్ని విమర్శించే విధంగా ఏ విదేశీ విద్యార్థి అయినా మాట్లాడినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా ఆ విద్యార్థిని వెనక్కి పంపేస్తాం అన్నది అమెరికా పాలసీగా ఇప్పుడు ఉంది. కోట్లాది మంది పాలస్తీని యన్లను నిర్వాసితులుగా మార్చి వారి భూభాగాలను స్వాధీనం చేసుకుని అక్కడ ఇజ్రాయిల్ అనే దేశాన్ని ఏర్పాటు చేసిన ”ఆక్రమణ వలసవాదాన్ని” గురించి కాస్సేపు మరిచిపోదాం. గాజాలో ఒక జాతినే ఉనికిలో లేకుండా చేయడానికి ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధం, అది మానవత్వ విలువలను ఎంత ఘోరంగా నాశనం చేస్తున్నప్పటికీ, దానినీ కాస్సేపు పక్కన పెడదాం. ఈ నరమేధానికి వ్యతిరేకంగా అనేకమంది యూదు విద్యార్థులే గొంతెత్తి నిరసనలలో భాగస్వాము లౌతున్నారన్న వాస్తవాన్నీ పక్కన పెడదాం. నెతాన్యహు ప్రభుత్వం గాజాలో సాగిస్తున్న దుర్మార్గాన్ని ఇజ్రాయిల్‌లోని మెజారిటీ ప్రజానీకం సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రన్నదీ పక్కన పెడదాం. ”యూదు వ్యతిరేకత” వేరు. ”యూదు జాత్యహంకార విస్తరణవాదం” వేరు అన్న దాన్నీ పక్కన పెడదాం. ఇక్కడ విషయం ఏమంటే అమెరికన్ ప్రభుత్వం ఎవరినైనా, ఏదో ఒక సాకుతో వెనక్కి పంపేసే హక్కు తనకు ఉన్నట్టు వ్యవహరిస్తోంది. యూదు వ్యతిరేకత అన్నది ఒక సాకు మాత్రమే. అమెరికన్ ప్రభుత్వం విధా నాలతో, చర్యలతో విభేదించే ఏ అంతర్జాతీయ విద్యార్థినైనా వాళ్లు తమ దాడులకు లక్ష్యంగా చేసుకుంటున్నారు.ఇప్పుడు విదేశీ విద్యార్థుల మీద, విదేశీ ప్రొఫెసర్ల మీద-వాళ్లు గ్రీన్‌కార్డు హోల్డర్లు అయినప్పటికీ- దాడులు సాగిస్తున్న అమెరికన్ ప్రభుత్వం రేపు తన స్వంత పౌరుల మీద కూడా ఇదే మాదిరిగా దాడులు చేయదన్న గ్యారంటీ ఏమైనా ఉందా? అమెరికన్ రాజ్యాంగంలోని మొదటి అమెండ్‌మెంట్ వాక్కు స్వేచ్ఛను గ్యారంటీ చేస్తుంది. గ్రీన్ కార్డు కలిగివున్న వాళ్లకి ఇది వర్తిస్తుందా అన్న సందేహం ఉండొచ్చు. కాని ఈ రోజు గ్రీన్‌కార్డు కలిగినవారి స్వేచ్ఛను నిరాకరించగలిగిన ప్రభుత్వం రేపు అమెరికన్ పౌరులకు కూడా నిరాకరించదన్న గ్యారంటీ ఏముంది? వాళ్లు కూడా ”అమెరికా వ్యతిరేకులతో” చేతులు కలుపుతున్నారన్న సాకుతో శిక్షార్హులుగా పరిగణించబడతారు కదా?1960-70 దశకాల్లో అమెరికన్ యూనివర్సిటీల్లో వాతావరణం ఏవిధంగా ఉండేదో, దానితో పోల్చి ప్రస్తుత వాతావరణాన్ని పరిశీలిద్దాం. అమెరికాలోను, ఇతర దేశాల్లోను యూనివర్సిటీల్లో వియత్నాం మీద అమెరికా సాగిస్తూండిన యుద్ధానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు తలెత్తాయి. ఎక్కడ చదువుకుంటున్న విదేశాల విద్యార్థులు అక్కడ యూనివర్సిటీల్లో జరిగిన నిరసన ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ విదేశీ విద్యార్థులను ప్రత్యేకించి లక్ష్యం చేసు కుని బెదిరించినదీ లేదు, నిర్బంధించినదీ లేదు. మరి అప్పటికి, ఇప్పటికి వచ్చిన తేడా ఏమిటి? ఎందుకు ఇప్పుడు ఈ విధంగా విదేశీ విద్యార్థులను భయోత్పాతానికి గురిచేస్తున్నారు? సామ్రాజ్యవాదం స్వభావంలో మార్పు వచ్చినదేమీ లేదు. అప్పుడెంత నిర్దాక్షిణ్యంగా సామ్రాజ్యవాదం ఉండేదో, ఇప్పుడూ అంతే నిర్దాక్షిణ్యంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బలహీన పడిన సామ్రాజ్యవాదం ఆ తర్వాత కాలంలో కోలుకుని మళ్లీ పుంజుకుంది. వియత్నాం యుద్ధంలో అమెరికా ఓడిపోయినా, సామ్రాజ్యవాదం మొత్తంగా చూసినప్పుడు తన బలాన్ని కూడగట్టుకోగలిగింది. ఒక పక్క సోవియట్ యూనియన్ నుండి సామ్రాజ్య వాదానికి తీవ్రమైన సవాలు ఎదురౌతూనే ఉండేది. అయినా, ఆ సవాలును తాను తట్టుకోగలను అన్న ధీమా సంపా దించుకుంది సామ్రాజ్యవాదం. అప్పటి వైరుధ్యాలను తాను ఎదుర్కొని తనకు అనుగుణంగా మలుచుకోగలదన్న ధీమా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఉండేదని పాల్ బేరన్, పాల్ ఎం స్వీజీ, హెర్బర్ట్ మార్కస్ వంటి మార్క్సిస్టు మేధావులు భావించారు. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం, దానితోబాటు మొత్తం సామ్రాజ్యవాద శిబిరం ఒక సంక్షోభంలో పూర్తిగా దిగబడిపోయివుంది. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, వారందరినీ ఎలాగైనా వదిలించుకోవాలనే యావ ఈ సంక్షోభ కారణంగానే సామ్రాజ్య వాదానికి పట్టుకుంది. ఆ వ్యతిరేకత యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఉండే మేథావుల నుంచే భావాల రూపంలో వచ్చినా, దాన్ని సైతం సహించే పరిస్థితి సామ్రాజ్యవాదానికి లేదు. అమెరికన్ విద్యా సంస్థల క్యాంపస్ లన్నీ ఉదారవాదులతో, వామపక్ష మూకలతో నిండిపోయి ఉన్నాయని, వారందరినీ వదిలించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది. దానికనుగుణంగానే అధికారులు ఎక్కడికక్కడ క్యాంపస్ నిరసనకారుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్ధారణను చాలా మంది వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు జరుగుతున్నదానికి కారణం ట్రంప్ అనే వ్యక్తికి ఫాసిస్టు మైండ్‌సెట్ ఉండడమే అని వారు అంటారు. అటువంటి మైండ్‌సెట్ ఉన్న వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడమే ఇప్పుడు నెలకొన్న సంక్షోభాన్ని వెల్లడి చేస్తోందని వారు గ్రహించాలి. సంక్షోభ సమ యంలో తమ ఆధిపత్యం చేజారి పోకుండా కాపాడు కోడానికి పాలకవర్గాలు అప్పట్లో ఫాసి స్టులతో చేతులు కలిపినట్టే ఇప్పుడు నయా ఫాసిస్టులతో చేతులు కలుపుతున్నారు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితికి ట్రంప్ గాని ఇక్కడ నరేంద్రమోడీ కాని కారణం కాదు. వారిని అధికారపీఠం మీద పాలక వర్గాలు కూర్చోబెట్టడానికి కారణభూతమైనది ప్రస్తుతం నెలకొన్న సార్వత్రిక ఆర్థిక సంక్షోభమే. ఈ సంక్షోభం తాలూకు ప్రత్యేక లక్షణం ఏమంటే, ఇందులోంచి బయట పడడానికి ప్రయత్నం చేసిన ప్రతీ సారీ ముందున్నదాని కన్నా లోతైన సంక్షోభంలోకి కూరుకుపోవడం. అధిక సుంకాల యుద్ధం తదితర చర్యలతో ట్రంప్ ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బైటకు అమెరికాను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఆ ప్రయత్నాలు సంక్షోభాన్ని మరింత జటిలం చేసేస్తున్నాయి. ఇది ఆ సంక్షోభ లక్షణం. కాని కొందరు ఈ పరిస్థితికి ట్రంప్ చేసే పిచ్చి పనులే కారణం అని వాదిస్తున్నారు. ఆ పిచ్చి పనుల వెనుక ఉన్న అసలు కారణం అయిన సంక్షోభాన్ని గుర్తించ డానికి నిరాకరిస్తున్నారు. వస్తూత్పత్తి రంగ పరిశ్రమల్ని తిరిగి అమెరికాకు రప్పించడానికి ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలు సర్వత్రా తీవ్ర అనిశ్చిత పరిస్థితి ఏర్పడడానికి దారి తీశాయి. పైగా అమెరికాలో వాటి వలన ఆర్థిక మందగమనం మరింత పెరిగింది. దాంతో అమెరికా ఆ సుంకాల యుద్ధాన్ని తాత్కాలికంగానైనా ఆపవలసివచ్చింది. అలాగే అమెరికన్ డాలర్ విలువను ఎలాగైనా పెంచాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి అనేక దేశాలు డాలర్-రహిత వ్యాపారం వైపు మొగ్గు చూపడానికి, తద్వారా డాలర్‌కు ఉన్న బలాన్ని సైతం దెబ్బ కొట్టడానికి దారి తీశాయి. ఇప్పుడ విదేశీ విద్యార్ధులను వెనక్కి పంపేయాలని ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా అలాగే బెడిసికొట్టక మానదు. క్లాసుల్లో చెప్పినది వినడం తప్ప తమ తమ స్వంత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని, మానవాళిని ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళ గురించి ఎక్కడా నోరిప్పకూడదని ట్రంప్ ప్రభుత్వం ఆదేశిస్తున్నది. దాని వలన అమెరికన్ విద్యా వ్యవస్థే ఎక్కువగా దెబ్బ తినిపోతుంది. ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు పదకొండు లక్షల మంది వరకూ ఉన్నారు. వారిలో అత్యధికులు ఫీజులు చెల్లించి చదువుకుంటున్నవారే. ఆ ఫీజులతోనే అమెరికన్ విద్యావ్యవస్థ నడవగలుగుతోంది. హార్వర్డ్, కొలంబియా వంటి యూనివర్సిటీలకు సైతం అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేస్తోంది. ”యూదు వ్యతిరేకుల” కేంద్రాలుగా అవి తయా రౌతున్నాయన్నది ప్రభుత్వ ఆరోపణ. ఇప్పుడు ప్రభుత్వ నిధులూ నిలిచిపోయి, విదేశీ విద్యార్థులూ రావడం మాను కుంటే అమెరికణ విద్యావ్యవస్థ గతి ఏమిటి? భిన్నమైన భావాల నడుమ నడిచే సంఘర్షణ లోంచే కొత్త కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, సమాజ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అటువంటి భావ సంఘర్షణను అణచి వేయడం వలన అమెరికాకు కలిగే నష్టం అపారం. దాన్ని పక్కనపెట్టినా, ఆర్థికంగా కూడా ఆ యూనివర్సిటీలు నడవలేని పరిస్థితి ఎదురౌతుంది. మూడవ ప్రపంచ దేశాలకు ఈ పరిస్థితి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంతకాలమూ తెలివైన మేధా వులంతా అమెరికాకు వెళ్లిపోతున్నారని, మేధో వలసలు జరిగిపోతున్నాయని బాధపడుతున్నాం. అత్యుత్తమమైన నిపుణుల్ని మన వద్ద నిలబెట్టుకోలేకపోతున్నాం అని వాపోతున్నాం. ఇప్పుడు అమెరికా వారిపట్ల వ్యవహరిస్తున్న తీరు మన వంటి దేశాలకు కొత్త అవకాశాలను ఇస్తున్నట్టే కదా? మోడీ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఇక్కడి యూనివర్సిటీలను ప్రజాతంత్రయుతంగా నడపడానికి పూనుకుంటుందని మనం ఆశించలేం. కాని మోడీకి ప్రత్యా మ్నాయంగా రూపొందే శక్తులు ఈ పరిస్థితిని ఒక అవకాశంగా ఉపయోగించడానికి ప్రయత్నించాలి. జర్మనీలో హిట్లర్ యూదు మేథావులను వేధింపులకు గురి చేస్తున్నప్పుడు వారిలో అత్యధికులు జర్మనీని వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. అప్పడే విశ్వభారతి యూనివర్సిటీని స్థాపించిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ మేధావుల్లో కొందరిని తమ యూనివర్సిటీకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు కూడా దేశంలో ప్రజాతంత్ర శక్తులు ఎక్కడెక్కడ బలంగా ఉన్నాయో అక్కడల్లా అటువంటి ప్రయత్నాలే చేయాలి. (స్వేచ్ఛానుసరణ)ప్రభాత్ పట్నాయక్
అమెరికన్ క్యాంపస్‌లలో భయోత్పాతం
- Advertisement -
RELATED ARTICLES