జాతీయ మీడియాలో సంచలన కథనాలు
ఢిల్లీ పేలుళ్ల అంశంపై చర్చకు నో
పార్లమెంటరీ ప్యానెల్ నిరాకరణ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనపై దర్యాప్తు సందర్భంగా అనేక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..2008 సెప్టెంబరు 26న ముంబయిలో జరిగిన వరుస దాడుల తరహాలో దేశ రాజధాని ఢిల్లీలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద దాడులకు లక్షిత ప్రాంతాలుగా ఎర్రకోట, ఇండియా గేట్ సహా ప్రముఖ కట్టడాలున్నట్టు సమాచారం. ఇందుకోసం పెద్ద సంఖ్య బాంబులను సంసిద్ధం చేసుకున్నట్టు కూడా జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది.
వైద్యుల టెర్రర్ వెనుక జైషే మహ్మద్
ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే పలువురు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి పథక రచన చేస్తున్నట్టుగా విచారణలో తేలినట్టు సమాచారం. ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పన్నుతున్నట్టు తెలిపాయి.
అల్ ఫలాహ్‌కు అప్రతిష్ట
వైద్యుల టెెర్రర్ మాడ్యూల్‌పై ఇటీవల జమ్మూకాశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, ఢిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లతో పాటు అత్యంత శక్తిమంతమైన మరో పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ పేలుళ్ల అంశంపై చర్చకు నో పార్లమెంటరీ ప్యానెల్ నిరాకరణ
ఎర్రకోట సమీపంలో పేలుళ్ల అంశంపై చర్చకు కేంద్ర హౌం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిరాకరించింది. బుధవారం నాడిక్కడ చైర్ పర్సన్ రాధా మోహన్ దాస్ అగర్వాల్ అధ్యక్షతన హౌం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రకోట సమీపంలో పేలుడుపై ప్రస్తావన వచ్చింది. అయితే దీనిపై చర్చించేందుకు చైర్‌పర్సన్ నిరాకరించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందిన అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లేవనెత్తారు.
ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అంశంపై చర్చ చేపట్టేందుకు కమిటీ చైర్‌పర్సన్ రాధా మోహన్ దాస్ నిరాకరించారు. దీనిపై సుమోటోగా ప్రకటన చేసేందుకు కూడా నిరాకరించారని ఆ వర్గాలు తెలిపాయి. విపత్తు నిర్వహణ ఎజెండాపై పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు హౌం మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ (ఎన్‌ఐడీఎం), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ క్యాంప్, హౌం గార్డ్స్ డీజీలు హాజరయ్యారు.
10 మంది సభ్యులతో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం
ఢిల్లీ పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ప్రత్యేక బందాన్ని ఏర్పాటుచేసింది. జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి ఆరా తీస్తోంది.



