ఒక్క పూటలో లక్షల కోట్లు ఆవిరి
వాషింగ్టన్ : అమెరికాలోని ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లాకు రోజు రోజుకు ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. టెస్లా అధినేత ఎలన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత టెస్లా ఆదాయం, లాభాలు భారీగా తరిగిపోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు 7,500 టాక్స్ క్రెడిట్‌ను ట్రంప్ ఇటీవల తొలగించారు. టెస్లా 2019 నుంచి 10.6 బిలియన్ల రెగ్యులేటరీ క్రెడిట్స్ ఆదాయం పొందింది. ఇది ఆ కంపెనీకి భారీగా లాభాలను తెచ్చి పెట్టింది. ఈ క్రెడిట్స్ లేకపోతే టెస్లా 2021 వరకు లాభం ఆర్జించలేదు. తాజాగా దీన్ని ఎత్తివేయడంతో ఆ కంపెనీ ఆదాయాలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టెస్లా నికర ఆదాయం 71 శాతం పడిపోయింది. మరో వైపు అమ్మకాలు తగ్గాయి. చైనాలోని బీవైడీ వంటి పోటీదారులు, మస్క్ రాజకీయ వైఖరిని నిరసిస్తూ కొంతమంది కొనుగోలుదారుల ఆందోళనలు కూడా టెస్లాకు సవాళ్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే టెస్లా షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సోమవారం ఒక్క రోజులోనే టెస్లా షేర్ 6.8 శాతం క్షీణించింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ 68 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.8 లక్షల కోట్లు) కరిగిపోయింది. ఎలన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య వివాదం తీవ్రమైంది. దీంతో ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో టెస్లా షేర్లు కుప్పకూలాయి. దీనివల్ల మస్క్ నికర సంపద 15.3 బిలియన్లు (రూ.1.31 లక్షల కోట్లు) తగ్గింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు టెస్లా షేర్లు 27 శాతం నష్టపోయాయి. ఎలన్ మస్క్ రాజకీయాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేయడమే ఇందుకు కారణం.
ఆర్థిక సమస్యల్లో టెస్లా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES