నవతెలంగాణ-రాయికల్
మండలంలోని అన్ని గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ వయోజన విద్య కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘ సభ్యులకు గ్రామాల వారీగా ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించారు. అక్షరాస్యత పెంపు,సామాజిక అవగాహన,ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు గ్రామాల్లో నిర్వహించిన పరీక్షలను ఏపిఎం నరహరి,సంబంధిత సీసీలు స్వయంగా పర్యవేక్షించి,పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకున్నారు.
పరీక్షలకు హాజరైన మహిళలు ఉత్సాహంగా పాల్గొని వారు నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..వయోజన విద్య ద్వారా మహిళలు అక్షరాస్యతతో పాటు రోజువారీ జీవితానికి అవసరమైన జ్ఞానం సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలలో విద్యపై ఆసక్తి పెరుగుతోందని,ఇటువంటి కార్యక్రమాలు వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివోఏలు పాల్గొని మహిళలను ప్రోత్సహించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గ్రామ స్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అభినందించారు. మండలవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా మహిళలలో విద్యపై చైతన్యం పెంపొందుతోందని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.



