Friday, October 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసీనియర్‌ టీచర్లకు 'టెట్‌' టెన్షన్‌

సీనియర్‌ టీచర్లకు ‘టెట్‌’ టెన్షన్‌

- Advertisement -

ఐదేండ్ల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులందరూ సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా రెండేండ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఉత్తీర్ణులు కావాలని లేదంటే ఉద్యోగం నుండి రిటైర్‌ కావాలని గత నెల సెప్టెంబర్‌ ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అంతేకాదు, ఐదేండ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్‌ కావాలంటే టెట్‌పాస్‌ కావాల్సిందేనని పేర్కొంది. దీనివల్ల 23 ఆగష్టు 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయుల్లో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది టీచర్ల ఉద్యోగాలకు ప్రమాదం పొంచిఉంది. మైనార్టీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ నియామకాలకు, మైనార్టీయేతర విద్యాసంస్థల్లో ప్రమోషన్‌ పొందడానికి టెట్‌ అవసరమా? అనే అంశాలపై ముంబాయి, మద్రాసు హైకోర్టులిచ్చిన వేర్వేరు తీర్పులపై సుప్రీంకోర్టులో సివిల్‌ అప్పీల్స్‌ దాఖలయ్యాయి.

వీటిపై విచారణ సందర్భంగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుతో అసలు వివాదం పక్కకు పోయి కొత్తసమస్య ముందుకొచ్చింది. మైనార్టీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు టెట్‌ అవసరమా లేదా అనే అంశంపై నిర్ణయం చేయకుండా ప్రధాన న్యాయమూర్తితో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేశారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రమోషన్‌ కోసమే కాకుండా సర్వీసులో కొనసాగాలంటే కూడా తప్పనిసరిగా టెట్‌ పాస్‌ కావాలని చెబుతూనే, రాజ్యాంగం ఆర్టికల్‌ 142 ప్రకారం మానవతా దృక్పథంతో ఐదేండ్లలోపు సర్వీసు ఉన్నవారికి టెట్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు, మిగిలిన వారికి టెట్‌ పాస్‌ కావడానికి తీర్పు తేదీ నుండి రెండేండ్లు సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏమిటి వివాదం?
6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు పిల్లలందరికీ నాణ్యమైన ఉచితవిద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2009లో విద్యాహక్కు చట్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ఒకేరకమైన విద్యార్హతలు, ప్రమాణాలు ఉండాలని, కేంద్ర ప్రభుత్వంచేత అధికారం ఇవ్వబడిన అకాడమిక్‌ అధారిటీ నిర్ణయించిన కనీస అర్హతలు ఉన్నవారు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించబడాలని విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23(1)లో పేర్కొన్నది. ఈ చట్టం చేసేనాటికి కనీస విద్యార్హతలు లేని ఉపాధ్యాయులుంటే వారు ఐదేండ్లలో సంబంధిత విద్యార్హతలు పొందాలని నిర్దేశించింది. తదుపరి యాక్ట్‌ ద్వారా ఆ గడువును మరో నాలుగేండ్లు పొడిగించింది. ఆది 31మార్చి 2019తో ముగిసింది. ఉపాధ్యాయులకు కనీస విద్యార్హతలు నిర్ణయించే ప్రాధికార సంస్థ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సిటిఈ) 31 మార్చి 2010న అర్హతలను నిర్ణయించి అదే ఏడాది ఆగష్టు 23 టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది.

పాఠశాలలను 1.పూర్వ ప్రాథమిక 2.ప్రాథమిక 3.ప్రాథమికోన్నత, 4.మాధ్యమిక/ ఉన్నత 5.ఉన్నత మాధ్యమిక పాఠశాలలుగా వర్గీకరించి, ఆయా పాఠశాలల్లో నియమించబడే ఉపాధ్యాయులకు ఉండాల్సిన కనీస విద్యార్హతలను పేర్కొ న్నది. విద్యాహక్కుచట్టం వర్తించే (1-8 తరగతులకు), ప్రాథమిక(1-5) పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామ కానికి ఇంటర్మీడియట్‌, డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, టెట్‌పేపర్‌ 1, ప్రాథమికోన్నత(6-8)పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి డిగ్రీ, బిఈడి, టెట్‌ పేపర్‌ 2 ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది ఎన్‌సిటిఈనే. టెట్‌ సిలబసు, పరీక్షా విధానాన్ని నిర్దేశించింది. ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు 60శాతం, ఓబిసిలకు(సి టెట్‌లో 55శాతం), స్టేట్‌ టెట్‌లో 50శాతం, ఎస్టీలకు 40శాతం ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించింది.

నిర్ణీత (అకాడమిక్‌) విద్యార్హతలు లేకుండా నియామకమైన ఉపాధ్యాయులకు అర్హత పొందటానికి ఆర్టీఈ చట్టంలో ఇచ్చిన సడలింపు మేరకు ఎన్‌సిటిఈ మొదట ఐదేండ్లు గడువు విధించింది. ఆ గడువును 2015లో మరొక నాలుగేండ్లు పొడిగించింది. అయితే ఎన్‌సిటిఈ నోటిఫికేషన్‌ 2010నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్‌ పాస్‌కావాలని ఎన్‌సిటిఈ ఎక్కడా చెప్పలేదు. అన్‌ ట్రైన్డ్‌, అన్‌ క్వాలిఫైడ్‌ టీచర్ల గురించి ఇచ్చిన గడువుగానే అందరూ భావించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు 23 ఆగషు ్ట2010కి పూర్వం నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ అవసరం లేదని స్పష్టం చేశాయి. అందుకే 2010 నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ప్రత్యక్ష నియామకం ద్వారా మరొక పోస్టుకు డీఎస్సీ/టీఆర్టీ రాయాలనుకున్నవారు మినహా ఎవరూ గత పదిహేనేండ్లుగా టెట్‌ రాయాలనే ఆలోచనే చేయలేదు.

పదోన్నతులు కూడా నియామకాల కిందకే వస్తాయి కనుక పదోన్నతి పొందటానికి టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరని పేర్కొంటూ తమిళనాడుకు చెందిన కొందరు ఉపాధ్యాయులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా హైకోర్టు ఎన్‌సిటిఈ నోటిఫికేషన్‌ నాటికి సర్వీసులో ఉన్న వారు టెట్‌ లేకున్నా సర్వీసులో కొనసాగవచ్చునని, ప్రమోషన్‌ పొందాలంటే టెట్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది. బాధితులు ప్రమోషన్ల రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయులు ప్రమోషన్‌ ద్వారా ఒకస్థాయి నుండి మరొక స్థాయికి మార్పు జరిగేట్లయితే వారి నియామకపు తేదీతో నిమిత్తం లేకుండా టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరని ఎన్‌సిటిఈ లీగల్‌ సెక్షన్‌ 11సెప్టెంబర్‌ 2023 ద్వారా స్పష్టం చేసింది. ఇంకా అకాడమిక్‌ సెక్షన్‌ ద్వారా పీఎస్‌, హైస్కూలు ప్రధానోపాధ్యాయుల పోస్టులు టెట్‌ నిబంధనల పరిధిలో లేవు కనుక ప్రమోషన్లు ఇవ్వడానికి టెట్‌ అవసరమా లేదా అనే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని వివరణ ఇచ్చింది. పై రెండు వివరణల్లో కానీ అంతకు ముందిచ్చిన ఏ ఉత్తర్వులోనూ సర్వీసులో కొనసాగడానికి టెట్‌ అవసరమని ఎన్‌సిటిఈ పేర్కొనలేదు.

విచిత్రమైన తీర్పు
సుప్రీంకోర్టు మెయిన్‌ కేసులో ఉన్న అసలు వివాదం మైనార్టీ విద్యాసంస్థల్లో టీచర్ల నియామకానికి టెట్‌ అవసరమా కాదా తేల్చకుండా రాజ్యాంగ ధర్మాసనానికి పంపించి, ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలన్నా, సర్వీసులో కొనసాగాలన్నా టెట్‌ పాస్‌కావాలని తీర్పు చెప్పింది. డీఎస్సీ లేదా టీఆర్టీ పరీక్షలు రాసి తీవ్రమైన పోటీలో నెగ్గి ఎంపికై 30 నుండి 15 ఏండ్లుగా సర్వీసులో ఉండి ఎంతోమంది విద్యా ర్థులను తీర్చిదిద్దారు ఉపాధ్యాయులు. వారు సర్వీసులో కొనసాగాలంటే ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాల్సిందే అనడం హాస్యా స్పదం గానూ, అర్థరహితంగానూ అనిపిస్తుంది. టెట్‌ పాసైన వారందరికీ ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నారా? అంటే అదీ లేదు. టెట్‌ పాసైనా మరలా డీఎస్సీ వడపోత ఉండనే ఉంది.

సుప్రీంతీర్పు ప్రకారం ఆరేండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయుడు రెండేండ్లలో టెట్‌ పాస్‌ కాకపోతే ఉద్యోగం నుంచి తొలగించబడతాడు. కానీ ఐదేండ్ల సర్వీసున్న ఉపాధ్యాయుడు టెట్‌ మినహాయింపుతో ఆ తర్వాత మూడేండ్లు సర్వీసులో కొనసాగుతాడు. ఇదొక పెద్ద అనామలీ. ఇంకా చెప్పాలంటే టెట్‌ సిలబస్‌, అర్హత మార్కుల నిర్ణయం కూడా అశాస్త్రీయం. ఎవరికైనా టెట్‌ కనీస అర్హత మార్కులు 35 లేదా 40శాతం ఉంటే సరిపోతుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి డిఎస్సీలో ఎలాగూ వెయిటేజి ఇస్తున్నారు. కనుక అభ్యర్థులే పట్టుదలతో ఎక్కువ స్కోర్‌ కోసం చదువుకుంటారు. కానీ ఏ పరీక్షలో లేని విధంగా 60శాతం, 50శాతం, 40శాతం ఉండాలనటం సమంజసం కాదు.

పరిష్కారం ఏమిటి?
ఉపాధ్యాయుల్లో నెలకొన్న భయాందోళనలు దూరం చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి విద్యాహక్కు చట్టం అమలుకు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి కాకుండా సవరణ ఉత్తర్వులు పొందాలి.ఉపాధ్యాయ అర్హత పరీక్షను ప్రాస్పెక్టివ్‌గా అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23ను సవరించాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సిలబస్‌ను, అర్హత మార్కులను సవరించి టెట్‌ పరీక్షను ఈ రెండేండ్లలో వీలైనన్ని ఎక్కువసార్లు నిర్వహించాలి. లేదా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ పరీక్షను నిర్వహించాలి.

బాధ్యతాయుతమైన అఖిల భారత ఉపాధ్యాయ సంఘంగా స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) సుప్రీంకోర్టు తీర్పుపై వేగంగా స్పందించింది. విద్యాహక్కు చట్టం అమలుకు పూర్వం నియామకమైన టీచర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫెడరేషన్‌ పక్షాన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రివ్యూ పిటిషన్లు వేయాలని కోరింది. విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23ను సవరించాలని ప్రధాన మంత్రి, కేంద్ర విద్యామంత్రికి వినతి పత్రాలిచ్చింది. టెట్‌ సిలబస్‌ను, అర్హతా మార్కులను సవరించాలని కోరుతూ ఎన్‌సిటిఈ చైర్మన్‌, మెంబర్‌ సెక్రటరీలకు లేఖలు రాసింది. అఖిలభారత స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఉమ్మడి కార్యాచరణ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కఅషిచేస్తూనే, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ భాగస్వాములను చేస్తూ క్యాంపెయిన్‌ నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నది.

చావ రవి
9490300571

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -