అమెరికా కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు
ట్రంప్ టారిఫ్‌లతో సగం మంది ఉపాధికి ఎసరు
న్యూఢిల్లీ : భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల ఎగుమతిదారులు యూరప్ మార్కెట్లపై దృష్టి పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగస్టులో భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్‌లను విధించడంతో భారత వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు వంటి ఉత్పత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎగుమతిదారులు ఐరోపా మార్కెట్‌లకు మళ్లుతున్నారని రాయిటర్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. తమ కంపెనీ ఇటీవల యూరోపియన్ యూనియన్ మార్కెట్లకు ప్రాధాన్యతను ఇస్తోందని ముంబయిలోని ఓ గార్మెంట్ ఎగుమతిదారు పేర్కొన్నారు. భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే ఎగుమతులు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చర్చలు నిర్ణయాత్మక దశలో ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి ఒప్పందం కుదిరేలా రెండు వైపులా అధికార బృందాలు పని చేస్తున్నాయి. భారత్‌కు వస్తువుల ఎగుమతి, దిగుమతుల్లో ఈయూ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 137.5 బిలియన్ డాలర్లకు చేరింది. పదేండ్లలో దాదాపుగా 90 శాతం పెరిగింది.
ఇయు కఠిన నిబంధనలు, కెమికల్స్, ప్రొడక్ట్ లేబులింగ్, ఎథికల్ సోర్సింగ్ పాటించేందుకు భారత ఎగుమతిదారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని క్లోథింగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మెంటర్ రాహుల్ మెహతా తెలిపారు. ఇయు ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పాదక కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 38 బిలియన్ డాలర్ల విలువ చేసే వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది దేశ మొత్తం వస్త్ర ఎగుమతుల్లో 29 శాతం వాటా కావడం విశేషం. కొందరు ఎగుమతిదారులు అమెరికా కస్టమర్లను నిలబెట్టుకోవడానికి ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నారని ముంబయిలోని క్రియేటివ్ గ్రూప్ చైర్మెన్ విజరు కుమార్ అగర్వాల్ తెలిపారు. అమెరికా అధిక టారిఫ్‌లు కొనసాగితే 15,000 మంది కార్మికుల్లో 6,000-7,000 మందిని కోల్పోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల్లో ఓమన్ లేదా బంగ్లాదేశ్‌కు ఉత్పాదనను తరలించే ఆలోచన ఉందని చెప్పారు. అదే జరిగితే భారత వస్త్ర తయారీ పరిశ్రమ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోనుంది.