Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూల్‌ అకౌంట్లపై టీజీసీఎస్‌బీ 'ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌'

మూల్‌ అకౌంట్లపై టీజీసీఎస్‌బీ ‘ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌’

- Advertisement -

రంగంలోకి 512 మంది అధికారులు : డీజీ శిఖా గోయెల్‌
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి

రాష్ట్రంలో సైబర్‌ నేరస్థుల ద్వారా ఆపరేట్‌ అవుతున్న మూల్‌ బ్యాంక్‌ అకౌంట్లపై ‘ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌’ను పెద్ద ఎత్తున తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో ఈ ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు ఆ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) శిఖా గోయెల్‌ బుధవారం తెలిపారు. మూల్‌ అకౌంట్ల ద్వారా సైబర్‌ నేరస్థులు అమాయక ప్రజలను మోసగిస్తూ వందల కోట్ల రూపాయలను దండుకుంటున్నారని ఆమె చెప్పారు. ప్రాథమికంగా 4775 మూల్‌ అకౌంట్లు ఆపరేట్‌ అవుతున్నాయని తమకు సమాచారముందని ఆమె తెలిపారు. ఈ 16 జిల్లాల్లోని 137 బ్యాంకులలో మూల్‌ అకౌంట్లు క్రియాశీలకంగా ఉన్నాయని అన్నారు.

ఈ ఖాతాల భరతం పెట్టడానికి టీజీసీఎస్‌బీకి చెందిన 512 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 137 బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. వీరు ఆయా బ్యాంకులలో అకౌంట్లను శోధిస్తున్నారనీ, అయితే ఈ మూల్‌ అకౌంట్లు తెరవడానికి కొన్ని బ్యాంకుల సిబ్బంది కూడా సహకరించినట్టు బయటపడుతోందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ప్రారంభించిన ‘ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌’ కార్యక్రమం ఆరు నెలల పాటు నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ మూల్‌ అకౌంట్ల ద్వారా రాష్ట్రంలోనేగాక ఇతర రాష్ట్రాల్లో సైతం భారీ ఎత్తున మోసాలు సాగుతున్నట్టు తమకు ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతాల్లోనూ దర్యాప్తును సాగిస్తున్నామని ఆమె తెలిపారు. మూల్‌ అకౌంట్ల పేరిట సైబర్‌ నేరస్థులు చూపిస్తున్న ఆశకు సామాన్య ప్రజలు లోనుకావొద్దనీ, ఇలాంటి వ్యక్తుల గురించి వెంటనే టీజీసీఎస్‌బీ లేదా పోలీసులకు సమాచారమివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -