Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపటి నుంచి టీజీఎప్‌సెట్‌ రిజిస్ట్రేషన్లు

రేపటి నుంచి టీజీఎప్‌సెట్‌ రిజిస్ట్రేషన్లు

- Advertisement -

మొబైల్‌ ఫోన్‌ నుంచి దరఖాస్తు చేసుకునే సౌకర్యం
ఏప్రిల్‌ 4 వరకు లేట్‌ ఫీజు లేకుండా దరఖాస్తులు మే లో పరీక్షలు : ఈఏపీసీఈటీ 2026 కన్వీనర్‌ డా. విజయ్ కుమార్‌ రెడ్డి


నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీఈఏపీసీఈటీ)-2026 రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నట్టు ఈఏపీసీఈటీ 2026 కన్వీనర్‌ డా. విజయ్ కుమార్‌ రెడ్డి తెలిపారు. లేట్‌ ఫీజు లేకుండా దరఖాస్తులను ఏప్రిల్‌ 4 వరకు అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in ద్వారా సమర్పించవచ్చన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని జీఎన్‌టీయూహెచ్‌లో ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈసారి వెబ్‌సైట్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుకూలంగా రూపొందించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంటర్నెట్‌ సెంటర్లకు వెళ్లాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మొబైల్‌ ఫోన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు.

ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చర్‌/ఫార్మసీ స్ట్రీమ్‌లకు విడిగా దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు రూ.900 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500) చెల్లించాలని, రెండు స్ట్రీమ్‌లకు కలిపి దరఖాస్తు చేయాలనుకుంటే రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.1,000) చెల్లించాలని తెలిపారు. రూ.250 లేట్‌ ఫీజుతో ఏప్రిల్‌ 10 వరకు, రూ.500 లేట్‌ ఫీజుతో ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ.2,500 లేట్‌ ఫీజుతో ఏప్రిల్‌ 20 వరకు, రూ.5,000 లేట్‌ ఫీజుతో ఏప్రిల్‌ 24 వరకు అవకాశం ఉంటుందన్నారు. అదనంగా రూ.10,000 లేట్‌ ఫీజుతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఈసారి కల్పించినట్టు తెలిపారు. ఇక ఏప్రిల్‌ 23 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌ల పరీక్షలు మే 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్‌ పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి షిఫ్ట్‌, మధ్యాహ్నం 3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్‌ నిర్వహిస్తామన్నారు. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రాథమిక కీ ఆధారంగా వారి స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారన్నారు. అయితే తుది కీ ప్రకారం సాధించిన నార్మలైజ్డ్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నట్టు కన్వీనర్‌ స్పష్టం చేశారు.

కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్ష
పరీక్షలను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు. పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీటీ)లో నిర్వహించనున్నామని, అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో సిద్ధమవ్వాలని సూచించారు. హాల్‌ టికెట్‌తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి అని, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నాలుగు జోన్లు సహా నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కరీంనగర్‌, సిద్ధిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో మొత్తం 16 జోన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (టీజీసీహెచ్‌ఈ) చైర్మెన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ డాక్టర్‌ టి. కిషన్‌ కుమార్‌ రెడ్డి, వైస్‌ చైర్మెన్‌- ప్రొఫెసర్‌ ఇ. పురుషోత్తం, వైస్‌ చైర్మెన్‌- ప్రొఫెసర్‌ ఎస్‌.కె.మహమూద్‌, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె. వెంకటేశ్వరరావు, టీజీసీహెచ్‌ఈ కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌, ఈఏపీసీఈటీ-2026 కో-కన్వీనర్‌ డాక్టర్‌ బి. బాలు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -