తుది పోరులో విజయం సాధిస్తాం : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ సంస్థ బ్రాక్(బిల్డింగ్ రీసోర్సెస్ అక్రాస్ కమ్యూనిటీస్) మన రాష్ట్రంలో అమలు చేస్తున్న తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం(టీజీఐఎల్‌పీ) పేదరికంపై తుది పోరాటంగా మారాలనీ, ఆ కార్యక్రమం ఒక మోడల్‌గా మారాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ఆకాంక్షించారు. ఆ పోరాటంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీనిచ్చారు. పేదరికంపై తుది పోరులో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి సీతక్కను బ్రాక్ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ తెలంగాణలో టీజీఐఎల్‌పీ సాధించిన పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..పేదరిక నిర్మూలన దిశలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి బ్రాక్ సంస్థ తమ వంతు సహకారం అందించాలని కోరారు. అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే టీజీఐఎల్‌పీ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక వనరులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి కార్యక్రమాలను రూపకల్పన చేయాలని సూచిస్తూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా లభించే ఇప్ప పుప్పు ఆధారంగా నూనె, ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. ”స్వచ్చమైన ఇప్పపువ్వు ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. దానిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ఆదాయ వనరుగా మలచవచ్చు” అని సూచించారు. ప్రస్తుతం ఐదు జిల్లాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో టీజీఐఎల్‌పీ అమలవుతున్నదనీ, ఇప్పటి వరకు 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించామని బ్రాక్ ప్రతినిధులు మంత్రి సీతక్కకు నివేదించారు. ఎంపిక చేసిన మహిళా సమాఖ్యల ద్వారా 108 మంది నిపుణులను నియమించి లబ్ధిదారులకు శిక్షణ అందిస్తున్నట్టు వివరించారు. పేద కుటుంబాలకు దీర్ఘకాలిక ఆదాయ మార్గాలను కల్పించి, వారిని ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడం తమ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరిన్ని జిల్లాలు, మండలాలకు విస్తరించాలని… ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన, పీవీటీజీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. మంత్రి సీతక్క సూచనలను సానుకూలంగా స్పందించిన బ్రాక్ ప్రతినిధులు..మరో 8 వేల కుటుంబాలకు నైపుణ్య శిక్షణతో పాటు వారి ఆదాయ మార్గాలను పెంచే విధంగా ఆర్దిక చేయుత అందిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో గ్రెగరీ చెన్ (మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ట్రా పూర్ గార్డియేషన్ ఇనిటియేటివ్) శ్వేతా బెనర్జీ (ఇండియా లీడ్), ఉషా రాణి (ప్రోగ్రాం లీడ్), వి. రమేష్ (సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్), అభిషేక్ (ప్రోగ్రాం అసోసియేట్) తదితరులు పాల్గొన్నారు. బ్రాక్ ప్రతినిధులను మంత్రి సీతక్క సత్కరించారు.
పేదరిక నిర్మూలనకు మోడల్‌గా టీజీఐఎల్‌పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES