Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంటీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి

టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి

- Advertisement -

గ్రూప్‌-1 అవకతవకలపై విచారణ చేపట్టాలి : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నేతల డిమాండ్‌
సుందరయ్య పార్క్‌ వద్ద నిరసన ర్యాలీ

నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రూప్‌-1 పరీక్షల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, వివాదాలకు నిలయంగా ఉన్న టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు, కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్‌ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలోనే టీజీపీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల రెండుసార్లు గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌ రద్దయిందని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష హాల్‌ టికెట్ల దగ్గర నుంచి మూల్యాంకనం వరకు వరుస వివాదాలకు టీజీపీఎస్సీ కేంద్ర బిందువు అయిందన్నారు. నిరుద్యోగ యువత లక్షలాది రూపాయలు కోచింగ్‌ సెంటర్లలో వెచ్చించి శిక్షణ పొంది పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో పారద ర్శకంగా నియామకాలు చేపట్టాల్సిన టీజీపీఎస్సీ.. వివాదాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తూ నిరు ద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.

టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్‌ సర్కార్‌ వరుస తప్పిదాలతో లక్షలాదిమంది నిరుద్యోగ యువతను మోసం చేస్తోందన్నారు. పరీక్ష నిర్వహించినప్పటి నుంచి అనేక అనుమానాలకు తావిచ్చిన టీజీపీఎస్సీపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదన్నారు. పరీక్ష పత్రాలను నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించాలన్నారు. తెలుగు మీడియం పేపర్లను తెలుగు మీడియం వారితోనే చేయించాలని, ఇంగ్లీష్‌ మీడియం పేపర్లను ఇంగ్లీష్‌ మీడియంకు సంబంధించిన నిపుణులతో మూల్యాంకనం చేయించాలన్న నిబంధనలున్నా వాటికి పాతరేస్తున్నారని విమర్శించారు.

గ్రూప్‌-1 పరీక్షల అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సబ్జెక్టు నిపుణులతోనే జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టాలన్నారు. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి అడ్డంకులు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టే విధంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి అందులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేవరకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వ హిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు డి.కిరణ్‌ కె.అశోక్‌రెడ్డి, ఎండీ జావీద్‌, శంకర్‌, మమత, ప్రశాంత్‌, రమేష్‌, రాజయ్య, విజరు కుమార్‌, లెనిన్‌, స్టాలిన్‌, నాగేందర్‌, శంకర్‌, సహన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad