Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంఆ102 ఎకరాల భూమి అటవీ శాఖదే

ఆ102 ఎకరాల భూమి అటవీ శాఖదే

- Advertisement -

సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు
సాలార్‌ జంగ్‌ వారసుల వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం
20 ఏండ్ల భూ వివాదానికి సుప్రీం తెర
ఫారెస్ట్‌ ఆఫీసర్ల అలసత్వంవల్లేనంటూ అసంతృప్తి
ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఆఫీసర్లదే
రెండు నెలల్లో రిజర్వ్‌ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని సీఎస్‌కు ఆదేశం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో ఉన్న దాదాపు రూ.15 వేల కోట్ల విలువ చేసే 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీ శాఖదే అని సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఆ భూమి ప్రయివేటు ఆస్తి (అరాజీ- మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ భూమి వ్యవహారంలో సాలార్‌జంగ్‌ వారసులు చేస్తున్న వాదననూ తోసిపుచ్చింది. అలాగే గతంలో ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. ఈ మేరకు గురువారం జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌. భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మొత్తం 47 పేజీల తీర్పును వెలువరించింది.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం సాహెబ్‌నగర్‌ కలాన్‌ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్‌ జాఫర్‌ అలీ ఖాన్‌ (సాలార్‌జంగ్‌-3 వారసులు) తదితరులు ఈ భూములు తమవే అని క్లైయిమ్‌ చేసుకుంటూ వస్తున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్‌ ఏప్రిల్‌ 20, 2023లో సుప్రీంకోర్టులో సివిల్‌ అప్పీల్‌కు వెళ్లింది. కాగా… గత రెండున్నర ఏండ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా… 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా ఇది తమ స్వార్జిత ఆస్తి అని, జాగిర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని ప్రతివాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. అయితే 2014లో ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్‌ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. కాగా… అన్ని వైపుల వాదనలు విన్న ధర్మాసనం… జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరమయ్యాయని తీర్పును వెలువరించింది.

ఆ పత్రాలు నమ్మేలా లేవు
1949లో జాగిర్ల రద్దు రెగ్యులేషన్‌ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతరాÄ్భగం అయ్యాయని సుప్రీం స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని గుర్తు చేసింది. అప్పటి నుంచి అది అటవీశాఖ ఆధీనంలోనే ఉందని తేల్చి చెప్పింది. కాగా… సాలార్‌జంగ్‌ వారసులు చూపించిన 1954 నాటి జాగిర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగినవిగా లేవని ధర్మాసనం తన తీర్పులో అభిప్రాయపడింది. జిరాక్సు పత్రాలను ఆధారంగా చేసుకుని, వాస్తవ రికార్డులను సరిగా పరిశీలించకుండానే కింది కోర్టులు తీర్పులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే, ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్‌ నయీమతుల్లా షుస్త్రీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను (సివిల్‌ అప్పీల్‌ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌దేనని తేల్చినందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.సుదీర్ఘకాలంగా ఆ భూమిపై వివాదాలు కొనసాగడం, అధికారుల అలసత్వంపై బెంచ్‌ అసహనం వ్యక్తం చేసింది.

ఈ కేసులో సమయానికి తగినట్టుగా అభ్యంతరాలను తమ వాదనలో తెలపడంలో ఫారెస్ట్‌ ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించారని అభిప్రాయ పడింది. అలాగే, టైటిల్‌ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్‌ కోర్టులకు మాత్రమే ఉంటుందని గుర్తు చేసింది. సమ్మరీ ఎంక్వైరీ చేసే ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌కు ఆ అధికారం లేదని తేల్చి చెప్పింది. ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ 102 ఎకరాల భూమిని ‘రిజర్వ్‌ ఫారెస్ట్‌’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్‌ ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్‌ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని తీర్పులో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -