Tuesday, September 16, 2025
E-PAPER
Homeజాతీయంఆ యుద్ధ విమానం చాలా కాస్ట్‌లీ గురూ !

ఆ యుద్ధ విమానం చాలా కాస్ట్‌లీ గురూ !

- Advertisement -

ఒక్కో జెట్‌ ఖరీదు 193 మిలియన్‌ డాలర్లు
అమెరికా, రష్యా విమానాల కంటే ఖర్చు అధికం
దేశ చరిత్రలోనే అతి పెద్ద రక్షణ ఒప్పందం

న్యూఢిల్లీ : రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో భారత్‌ కుదుర్చుకోబోతున్న 22 బిలియన్‌ డాలర్ల ఒప్పందం దేశ చరిత్రలోనే అతి పెద్ద రక్షణ ఒప్పందం కాబోతోంది. ఒప్పందానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం లభించిన పక్షంలో ప్రపంచంలోనే రఫేల్‌ అత్యంత ఖరీదైన యుద్ధ విమానం అవుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖకు భారత వైమానిక దళం పంపిన ప్రతిపాదన ప్రకారం ఒక రఫేల్‌ యుద్ధ విమానం ఖరీదు 193 మిలియన్‌ డాలర్లు. అంటే 17,03,52,48,834 రూపాయలు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఈ ఒప్పందంలో కేవలం ఫైటర్‌ జెట్‌ ఖర్చును మాత్రమే చేర్చలేదు. ఉత్పత్తి వ్యయాన్ని, రఫేల్‌లో అమర్చే క్షిపణుల ఖర్చును కూడా కలిపారు. అంతేకాదు…ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌, శిక్షణ కార్యక్రమం ఖర్చులు, మౌలిక సదుపాయాల నిర్వహణ, దీర్ఘకాలిక లాజిస్టిక్‌ మద్దతుకు సంబంధించిన వ్యయాన్ని మొత్తాన్నీ అందులో చేర్చారు.

ఇతర విమానాల ధరతో పోలిస్తే…
అమెరికాకు చెందిన ఎఫ్‌-35ఏ, యూరోఫైటర్‌ టైఫూన్‌, రష్యాకు చెందిన సుఖోరు ఎస్‌యూ-35ఎస్‌ యుద్ధ విమానాలతో పోలిస్తే రఫేల్‌ విమానాల ఖర్చే అధికం. భారత వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లు అవసరం కాగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయి. స్క్వాడ్రన్‌ అంటే సైనిక దళంలో ఓ విభాగం లేదా యూనిట్‌. వైమానిక దళానికి సంబంధించి ఇది ఓ విమాన యూనిట్‌. కేంద్ర ప్రభుత్వం గతంలో రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు దాని ధరనే ప్రధానంగా ప్రస్తావించాయి. ప్రపంచంలో అందుబాటులో ఉన్న మిగిలిన అత్యాధునిక యుద్ధ విమానాలతో పోల్చినప్పుడు రఫేల్‌ ఖరీదు చాలా అధికంగా ఉంది. అమెరికాలో తయారైన ఎఫ్‌-35ఏ లైట్నింగ్‌-2 విమానం ఐదో తరానికి చెందినది. దీని ఖరీదు 110 మిలియన్‌ డాలర్లు మాత్రమే. యూరోఫైటర్‌ టైఫూన్‌ (ట్రాంచ్‌ 3ఏ) ఖరీదు చూసినా 117-130 మిలియన్‌ డాలర్లే. అదే రఫేల్‌ యుద్ధ విమానం ఖరీదు ఏకంగా 193 మిలియన్‌ డాలర్లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -