Sunday, October 26, 2025
E-PAPER
Homeజోష్ఆ గోవా ఫిలిం ఫెస్టివల్ నా జీవితాన్నే మార్చేసింది

ఆ గోవా ఫిలిం ఫెస్టివల్ నా జీవితాన్నే మార్చేసింది

- Advertisement -

పుట్టినరోజుకు తండ్రి కొనిచ్చిన కెమెరానే అతడిలోని సినిమా పిచ్చిని మొదటగా ‘క్యాప్చర్‌’ చేసింది. బ్లాకుబోర్డ్‌ మీద విన్న పాఠాలకంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీలో గమనించిన ‘సినిమా మ్యాజిక్కే’ ఎక్కువగా గుర్తుండేది. బీటెక్‌ లో నేర్చుకోవాల్సిన ఫార్ములాలకంటే స్క్రీన్‌ ప్లేలోని ‘త్రీ ఆర్క్‌ స్ట్రక్చర్‌’ మీదే ఎక్కువ కసరత్తు నడిచేది. నేలలోకి వెళ్ళిన విత్తనం ఎలా అంకురించకుండా మానదో మనసులో నాటుకొన్న లక్ష్యం ప్రయత్నాలకు ప్రాణం పోయకుండా వదలదు. బర్త్‌ కెమెరా టూ ‘పరదా’ మూవీ మెగా ఫోన్‌ పట్టుకొనేదాకా సాగిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ కాండ్రేగులగారి ఫిలిం జర్నీ వారి మాటల్లోనే విందాం.

మాది వైజాగ్‌. సహజంగా సినిమా డోస్‌ కాస్త ఎక్కువగా ఉండే ప్రాంతం. సినిమాల్లోకి వెళ్తాను అంటే మా ఇంట్లోవాళ్ళు ఏం తిట్టలేదు (నవ్వుతూ). నేను ఏది చేస్తా అన్నా మొదటినుంచి అమ్మ (అంజు), నాన్నల (రామచంద్రప్రభు కాండ్రేగుల) సపోర్ట్‌ ఉండేది. సినిమాలో అవకాశాలకు సమయం పడుతున్నప్పుడు అన్న ప్రతాప్‌ కాండ్రేగుల మోటివేషన్‌, జీవితంలోనే కాకుండా, ఫిలిం జర్నీలోనూ తోడుగా నిలిచిన నా భార్య రమ్యకృష్ణ… ఇలా నా కుటుంబం మొత్తం పాజిటివ్‌ సైడ్‌ నిలబడడమే నా సక్సెస్‌ కు కారణంగా భావిస్తాను. ఫ్రెండ్స్‌ సపోర్ట్‌ మరువలేనిది. ముఖ్యంగా వసంత్‌ (‘శుభం’ మూవీ కథా రచయిత)ది నాది స్పెషల్‌ ఫిలిం బాండింగ్‌.

అందరి సినిమాలు, అన్ని సినిమాలు ఆస్వాదిస్తా
కొందరు మేకర్స్‌ అన్నిరకాల సినిమాలు ఎలా తీయలేరో అలాగే ఆడియన్స్‌ కూడా అన్నిరకాల సినిమాలు ఎంజాయ్ చెయ్యలేరు. కానీ నా వరకు నేను ‘బైస్కిల్‌ థీఫ్‌'(1948)ను ఏ విధంగా ఎంజాయ్ చేస్తానో ‘అఖండ'(2021)ను కూడా అంతే స్థాయిలో ఎంజాయ్ చేస్తా. ఫిలిం చూసేటప్పుడు నాలోని మేకర్‌ అడ్డుపడకుండా ఆడియన్‌ గానే చూస్తా. ఒక ఫిలిం మేకర్‌ కి ఇది చాలా అవసరం. ఆర్ట్‌ సెన్స్‌ ని టెక్నికల్‌ మైండ్‌ డామినేట్‌ చేయకూడదు. ఆర్ట్‌ వ్యాల్యూ ఉంటేనే కమర్షియల్‌ వ్యాల్యూవ్స్‌ తో కథ చెప్పే మణిరత్నం, నవలలకంటే ఎక్కువ పాపులర్‌ అయ్యేలా సినిమాలు తీసిన స్టాన్లీ కుబ్రిక్‌ లు చాలా ఇష్టం. ఒకరకంగా ఇన్స్పిరేషన్‌ కూడా. అలాగే రాజమౌళి, రాజ్‌ కుమార్‌ హిరానీ, స్పీల్‌ బర్గ్‌, జేమ్స్‌ కామరూన్‌, అకీర కురుసోవా సినిమాలు కూడా ఇష్టమే.

ఆ మీటింగ్‌ మార్చేసింది
దశాబ్దంపాటు ఇండిస్టీలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎక్కడా సరైన అవకాశం దొరక్కుండా ఉండేది. ఒక దశలో విరక్తి కలిగి నాన్నకున్న వ్యాపారం చూసుకొందామని ఏడాదిపాటు ఇండస్ట్రీకి దూరంగా బెంగుళూరు వెళ్ళిపోయా. అవసరాలు తీరుతూ ఉన్నా, లోపల ఎక్కడో మనం ఇది కాదే అనే భావన మెదులుతూ ఉండేది. నా ఫ్రెండ్‌ వసంత్‌ నేను గోవాలో జరిగిన గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2018)కి వెళ్ళాం. అక్కడ అనుకోకుండా మన తెలుగు వాళ్లైన రాజ్‌ అండ్‌ డీకే (‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ మోవీ దర్శకులు) గార్లను కలవడం. మేము ఇలా ఓ స్టోరీ(సినిమా బండి) అనుకొంటున్నామని లైన్‌ చెప్పగానే వాళ్ళకు బాగానే నచ్చింది. కానీ మేం కొత్తవాళ్ళనే సందేహం వ్యక్తం చేసారు. దానికి మేం 45 నిమిషాల నిడివిగల డెమో ఫిలిం తీయడం. చూపించడం. వాళ్ళు ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకురావడం. డెమో తీసిన నటీనటులతోనే ‘సినిమా బండి’ తీసెయ్యడం. నిర్మాతలు రాజ్‌ అండ్‌ డీకే వాళ్ళు నెట్ఫ్లిక్స్‌ తో మాట్లాడి అందులో రిలీజ్‌ చేయడం. కోవిడ్‌ పిరియడ్‌ లో ఇంటిల్లిపాది అందరూ చూడడం. నచ్చడం. ఇండిస్టీలో చాలామంది మెచ్చుకోవడం చకచక జరిగిపోయింది. ఆ గోవా ఫిలిం ఫెస్టివల్‌ లో రాజ్‌ అండ్‌ డీకే సార్లతో జరిగిన మీటింగే మళ్ళీ నన్ను ఫిలిం ఇండస్ట్రీకి దగ్గర చేసింది.

‘సినిమా బండి’, ‘శుభం’, ‘పరదా’ మూడు ప్రత్యేకమే.
‘సినిమా బండి’ కంటెంట్‌ పరంగా నేను అనుకొన్న దానికంటే ఎక్కువగా ప్రజలకు చేరువైన సినిమా. పైగా సినిమా గురించి ఉండే సినిమా. అందులోనూ నా మొదటి సినిమా కావడం. అదొక డిఫరెంట్‌ ఫీలింగ్‌. ‘శుభం’ వసంత్‌ ఎప్పటినుంచో అనుకొంటున్న కథ. అదే టైంలో సమంత మేడం కూడా తన ప్రొడక్షన్‌ లో మంచి కథ కోసం చూస్తున్నారన్న విషయం రాజ్‌ అండ్‌ డీకే ద్వారా తెలిసింది. మేడంకి కథ చెప్పడం. నచ్చడంతో తొందరంగానే మూవీని కంప్లీట్‌ చేశాం. థ్రిల్లర్‌ జానర్‌ లో మన జీవితాల్లో ఉండే కామిక్‌ జోడించి తీసిన సినిమా ‘శుభం’. ఇదొకరకంగా తెలుగులో ప్రయోగమనే చెప్పాలి. ‘పరదా’ చాలా స్ట్రాంగ్‌ నేరేషన్‌ ఉన్న కథ. మనం పాటించే మూఢనమ్మకాలన్నీ ఎక్కడో ఒకచోట భయంగానే, అవసరంగానో మొదలైనవే. వాటిని ఓవర్‌ కం చేసే క్రమంలో చేయాల్సిన పోరాటాన్ని తెలిపే సినిమా. మిగతా సినిమాలకంటే ఎక్కువ జోష్‌ తో చేసిన సినిమా. ఫలితం పరంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ‘పరదా’ నాకు చాలా సంతప్తినిచ్చిన సినిమా. వీడు పెద్ద సినిమాలు కూడా డీల్‌ చెయ్యగలడని నిరూపించిన సినిమా. వాస్తవానికి ‘పరదా’ నా రెండో సినిమా కావాల్సింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కు ఎక్కువ టైం పట్టే క్రమంలో ‘శుభం’ నా రెండో సినిమాగా రిలీజ్‌ అయ్యింది. నాకు ఈ మూడు సినిమాలు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రస్తుతానికి టైం ట్రావెల్‌ సినిమా తీద్దాం అని ఆలోచనల్లో ఉన్నా. ఆ కథ కోసమే ప్రస్తుతం కసరత్తు నడుస్తుంది.

నాకు సినిమాకంటే జీవితం గొప్పది
ఆయా రంగాలలో ఉండే చాలామంది మా జీవితంకంటే మేం పనిచేస్తున్న రంగమే గొప్పదని చెబుతుంటారు. దేనికైనా మనిషే ప్రధానం. అందుకు జీవితమే కొలమానం. అందులోని ‘రా మెటీరియలే’ ఈ ప్రపంచం. మనిషిగా మనం జీవితాన్ని దాటి దేన్నీ నిలబెట్టలేమేమో అనిపిస్తుంది. ఈ షార్ట్‌ టర్మ్‌ లైఫ్‌ లో చాలా ప్రయాణాలు చేయాలి. చాలామంది వ్యక్తులను కలవాలి. నచ్చినవి నేర్చుకొంటూ రోజుకో కొత్తకోణాన్ని చూస్తూ పోవాలి. ఏదైనా వ్యాధి వచ్చి చచ్చిపోతాం అన్నప్పుడు ఏ విధంగా జీవితాన్ని ప్రేమిస్తామో అలాగే మరణం అనేది తప్పదని తెలుసుకొని జీవితాన్ని ఆస్వాదించాలి. ఆ విషయం మర్చుపోకుండా గుర్తుచేసేలా ఉండాలనే నా చేతికి RIP అనే ట్యాటూ (చూపిస్తూ) వేయించుకొన్న.

  • మదన్‌ మోహన్‌ రెడ్డి 99898 94308
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -