రాహుల్ గాంధీ విమర్శ
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశకు చివరి రోజైన మంగళవారం విస్తృతంగా ప్రచారంలో నాయకులు పాల్గొన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి సమస్యలపై యువత దృష్టి పెట్టకూడదని ప్రధాని మోడీ కోరుకుంటు న్నారని విమర్శించారు. యువతలో సోషల్ మీడియా వ్యసనాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘యువత రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు బానిస కావాలని మోడీ కోరుకుంటున్నారు. ఇది 21 శతాబద్దపు కొత్త ఎత్తు. యువత పరధ్యానంలో ఉండటం, విద్య, ఆరోగ్యం, ఉపాధికి సంబంధించిన సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా ఉండాలని మోడీ కోరుకుంటున్నారు’ అని రాహుల్ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించదని తెలిసే.. అమిత్ షా, మోడీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని కూడా రాహుల్ విమర్శించారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ రాష్ట్రంలోని యువతను వలస కార్మికులుగా మారుస్తున్నారని విమర్శించారు. ‘బీహార్‌లో ఇండియా బ్లాక్ ప్రభుత్వం వస్తే అత్యంత వెనుకబడిన, సామాజికంగా అణగారిన, దళితుల ప్రభుత్వంగా ఉంటుంది’ అని రాహుల్ తెలిపారు. మంగళవారం మొత్తంగా మూడు ర్యాలీల్లో రాహుల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ‘నకిలీ డిగ్రీ’ ఉందని రాహుల్ ఆరోపించారు. చరిత్ర కాలంలో ప్రపంచం లోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో నలంద ఒకటని, ఇక్కడ చైనా, జపాన్, కొరియాకు చెందిన విద్యార్థులు చదువుకునేవారని అన్నారు. అయితే మోడీకి ఇలాంటి వాటిపట్ల ఆసక్తి లేదని, ఎందుకంటే ఆయనకు నకిలీ డిగ్రీ ఉందని రాహుల్ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో బీహార్ మహిళలకు రక్షణ భద్రత కరువయిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
బీహార్ మహిళల సాధికారత, ఆర్థిక అభ్యున్నతికి మహాగట్‌బంధన్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖర్గే ఎక్స్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న హామీలు కేవలం ఓట్ల కోసమే కాదని, వాటిని నెరవేరుస్తామని తెలిపారు. ‘బీహార్‌లో బీజేపీ-జేడీ(యూ) ప్రభుత్వం గత 20 ఏండ్లుగా అధికారంలో ఉంది. అయినా నేటీకీ ఇక్కడి కోడళ్లు, కుమార్తెలు సురక్షితంగా లేరు’ అని ఖర్గే చెప్పారు. మహిళలతో పాటు రాష్ట్రంలో చిన్నారుల పరిస్థితి కూడా తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఖర్గే అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) డేటా ప్రకారం బీహార్‌లో 70 శాతం చిన్నారులు రక్తహీనతతోనూ, 40 శాతం మంది పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నారని చెప్పారు.



