సామాజిక ఆలోచనాపరుల తాత్విక చింతనలు
ఎంతలా ఒకేలా ఉంటాయి?!
”కులముగలవాడు, గోత్రంబుగలవాడు
విద్యచేత విర్రవీగువాడు
పసిడిగలవాని కొడుకులు” – 17-18 శతాబ్దాల మధ్య వేమన
”వైద్యులనూ, ప్లీడర్లనూ, పురోహితులనూ, కవుల్నీ, శాస్త్రజ్ఞుల్నీ అందర్నీ తనకు (పెట్టుబడికి) ఊడిగం చేసే కూలీలుగా మార్చేసింది”. – 19వ శతాబ్దం మధ్య కమ్యూనిస్టు మేనిఫెస్టోలో మార్క్స్, ఏంగెల్స్.
విధానం సంక్షోభంలో పడేసరికి రాక్షసం విరుచుకుబడ్తోంది! మరో అతి పెద్ద దేశవ్యాపిత సమ్మెకు కార్మికులు సిద్ధమవుతున్న సందర్భంలో సీజేఐ గారి నోట్లోంచి జాలువారిన సదరు ”ఆణిముత్యాలు” దురదృష్టకరమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా! ఆ వ్యాఖ్యానానికి మద్దతుగా కొన్ని అంకెలు, సంఖ్యలు చెప్పి ఉంటే బాగుండేది! ఏమైనా ఆయన ”బాధ్యత” ఆయన నిర్వర్తించారు!
ఇక్కడొక చిక్కొచ్చి పడింది. నాలుగు ‘కోడ్సూ’ నోటిఫై చేసేముందు మోడీ సాబ్ చెప్పింది నమ్మాలా? పెద్ద కోర్టు పెద్ద జడ్జీ గారు చెప్పింది నమ్మాలా? ఊగిసలాడే కార్మికుల మెదళ్లు ఇప్పుడు తేటపడ్డాయి. గంభీర ప్రవచనాల వెనక రాజకీయ జుమ్లాలున్నా యని అర్థం చేసుకుని ఫిబ్రవరి 12 సమ్మెకు నడుం బిగిస్తున్నారు. ‘అందరికి అన్నీ’ అన్న రాజకీయుల మాటల మూటలను సీజేఐ గారి గుండుపిన్ను ‘టప్ప్’ మని పేల్చి, ‘ఎవరికి ఏమీ’ లేదని తేల్చింది. తమిళనాట ఇంటిపనివారల సంఘం (పెన్ తోజిలార్‌గళ్) తమని షెడ్యూల్‌లో చేర్చి సంక్షేమ చర్యలు అమలు చేయాలని సుప్రీం తలుపు తడితే (ఇప్పటికే తెలంగాణలో ఆ సౌకర్యం పేపర్ మీద ఉందని ఆయనకు తెలుసో తెలీదో) లేదు ఫోండనీ, దేశ ప్రగతి ఆగిపోడానికి కారణం కార్మిక సంఘాలేనంటూ విరుచుకుబడ్డారు.
దేశంలో విఫలమైంది ఉదారవాద ఆర్థిక విధానాలు సార్! ఆ గాజుకొంపలో కూచుని కార్మికోద్యమంపై ఎవరూ రాళ్ళు విసరలేరు. దేశంలో పారిశ్రామిక వివాదాలే తగ్గిపోతున్నాయనే విషయం ఏ అధికారైనా పాపం! న్యాయ వ్యవస్థకెపుడైనా చెప్పేడుస్తేగా! 2006లో సాలుకు 430 పారిశ్రామిక వివాదాలుంటే, 2015-23లో (అంటే మోడీ శకంలో) నాటకీయంగా 75కి తగ్గాయి. 2023లో దేశవ్యాప్తంగా 30 మాత్రమే! ఇక ట్రేడ్ యూనియన్లు దేనికి బాధ్యత వహించాలి? పారిశ్రామికోత్పత్తి తగ్గుదలకు వాటికేం బాధ్యతుంది? సైద్ధాంతిక పునాదిగాని అనుభవ పూర్వక వివరాలుగానీ (ఎంపెరికల్ ఎవిడెన్స్) లేకుండా మాట్లాడితే ఎలా? ఇవి వాస్తవాలను తిరగేసి చూడటం కదా?!
పైగా పార్లమెంటులో కార్పొరేట్ మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానంలో 2,04,268 ప్రయివేటు పరిశ్రమలు ఒకదాన్లో ఒకటి కలిసిపోవడం (అమాల్గమే షన్), మార్పిడి (కన్వర్షన్), విలీనం (డిసాల్వ్) కావడం జరిగింది. కార్మిక సంఘాలు కారణమని చెప్పలేదు. అంత పెద్ద జడ్జిగారికి ఇంత చిన్న లెక్కలు తెలియదనుకోలేం! అదనంగా ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ బోర్డు ఆఫ్ ఇండియా (ఐబిబిఐ) ఏమి లెక్క తేల్చిందంటే కార్పొరేట్ వైఫల్యాలకు ప్రధాన కారణం అప్పులు చెల్లించలేకపోవడం, టెక్నాలజీ అప్‌గ్రడేషన్ లేకపోవడం, విదేశీ పోటీ తట్టుకోలేకపోవడం వంటి ఇతర ఎన్నో కారణాలను పేర్కొంది. 1998-2000 సంవత్సరం నుండి ఇలాంటి కారణాలను ప్రభుత్వ సంస్థలే పేర్కొంటున్నా అవే విధానాలను కార్పొరేట్ల కోసమే నాటి పీవీ నుండి నేటి మోడీ వరకు ఆబగా అమలుచేస్తున్నారు.
ప్రభుత్వరంగ పరిశ్రమలు మంచి ప్రధాన ఉపాధి కేంద్రాలు. వాటిని భ్రష్టు పట్టించారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్‌ఎంఈలు (మీడియమ్ స్మాల్ మైక్రో పరిశ్రమలు) 11 కోట్ల 30 లక్షలు మంది ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. బహుళజాతి కంపెనీల పీక్కుతినే తత్వానికి వీటిని బలిచేస్తున్నారు. మన దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగం మోన్‌శాంటో, కార్గిల్, బేయర్ వంటి ఎంఎన్‌సిల ఆకలికి బలౌతున్నది. 2014 నుండి మోడీ వేసే గోశాయి చిట్కాలకు ఉపాధి పెరుగుతుందా? ఆర్థిక వ్యవస్థలోని ఈ అంశాలను పట్టించుకో కుండా కార్మిక సంఘాలను తప్పుపడితే ఉపయోగమేమిటి?
మరో కీలకాంశం ఆర్టికల్ 19(1)(సి) సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితపడే హక్కు భారత రాజ్యాంగమే ఇచ్చింది. ఇది సీజేఐకి తెలియదని అనుకోలేం. ఆర్థిక విధానాలను, కార్మిక హక్కులను ఒకదానికొకటి సంబంధంలేనివిగా న్యాయ వ్యవస్థ పరిగణించడం మరో దౌర్భాగ్యం. దీన్నే కొందరు విమర్శకులు ‘మార్కెట్ సిద్ధాంతం, ఆర్థిక ఇంగిత జ్ఞానం (ఎకనామిక్ కామన్‌సెన్స్)తో న్యాయ వ్యవస్థ నిండిపోతోంద”ం టున్నారు. ‘సులభతర వ్యాపారం’ కోసం పాలకులు తలుపులు బార్లా తెరుస్తూంటే అది అన్యాయమని ‘న్యాయం’ అనకపోవ డం నిజంగా అన్యాయమే. జనవరి 31 పత్రికల్లో వార్త చూస్తే రూ.35,962 కోట్లు విదేశీ సంస్థాగత పెట్టుబడులు ”మునిగిపోయే పడవలో నుండి” బయటికి దూకినట్లు దూకేశాయి. అవిగవిగో పెట్టుబడులు.. ఇవిగివిగో ఉద్యోగాలం టూ సీఎమ్మ్‌లు, పీఎమ్మెలు ఎంత ఊదరగొట్టినా ఖాళీ సంచీలే మిగుల్తున్నాయి. వచ్చే పెట్టుబడులూ లేవు, ఉపాధి అంతకన్నా లేదు.
కార్మికులకు సంబంధించినంత వరకూ ఫిబ్రవరి 12 చావో రేవో తేల్చుకోవాల్సిన దేశవ్యాపిత సమ్మె. ఆషాడభూతులెందరు అడ్డుపడ్డా కార్మికులారా! ఆగేబఢో!!



