Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆ వజ్రాయుధం ఎవరికి తగలాలో వారికే తగిలింది..

ఆ వజ్రాయుధం ఎవరికి తగలాలో వారికే తగిలింది..

- Advertisement -

అందుకే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు…
ఐక్యంగా కాపాడుకోవాలి
సమాచారం ఇవ్వాలనే చిత్తశుద్ధి అధికారులకు ఉండాలి
బాధితుల సమస్యలను సానుకూల దృక్పథంతో చూడాలి
‘ఆర్టీఐ’పై చర్చాగోష్టిలో కమిషనర్లు అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అనేది ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అది ఎవరికి తగలాలో వారి(ప్రధాని మోడీకి)కే తగిలిందని ఎద్దేవా చేశారు. అందువల్లే కక్షగట్టి, ఉద్దేశపూర్వకంగా దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఐ కార్యకర్తలు, ప్రజలు, సామాజికవేత్తలు, మేధావులు ఐక్యంగా పోరాడటం ద్వారా ఆ చట్టాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ‘సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాలి…’ అనే అంశంపై అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం (యూడీఎఫ్‌), హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం (హెచ్‌సీఎఫ్‌), పీపుల్స్‌ ఫ్రంట్‌ ఫర్‌ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ (పీఎఫ్‌ఆర్‌ఐ) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్వీకేలో చర్చాగోష్టి నిర్వహించారు.

హెచ్‌సీఎఫ్‌ అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత యూడీఎఫ్‌ కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ… ఆర్టీఐని నిర్వీర్యం చేస్తున్న తీరును సోదాహరణంగా వివరించారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ‘మీరు అడిగిన తీరు ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది, ప్రశ్నలు అడగపోయినా అదే నమూనాలో ఉంది…’ అనే కుంటిసాకులు చెబుతూ అధికారులు అప్లికేషన్లను తిరస్కరిస్తున్న వైనాన్ని ఆయన ఏకరువు పెట్టారు. కొన్నిసార్లు ‘మీరు భారతీయుడని నిరూపించుకోండి, అందుకోసం ఆధార్‌ కార్డును జత చేయండి…’ అంటూ అధికారులు… ఆర్టీఐ కార్యకర్తలకు సవాలక్ష కొర్రీలు, యక్షప్రశ్నలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథితోపాటు పలువురు ఆర్టీఐ కార్యకర్తలు మాట్లాడుతూ… ఆర్టీఐ కింద సమాచారం అడిగినప్పుడు అధికారులు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న తీరును, సెక్షన్‌ 6(3) కింద ఇతర విభాగాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసి చేతులు దులుపుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. వారు లేవనెత్తిన పలు అంశాలకు అయోధ్యరెడ్డి, శ్రీనివాసరావు సమాధానాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్తలకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారమార్గాలను చూపారు.

అయోధ్యరెడ్డి మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ హయాంలో ఆరున్నరేండ్లపాటు ఆర్టీఐకి ప్రధాన కమిషనర్‌నుగాని, కమిషనర్లనుగాని నియమించలేదని గుర్తు చేశారు. దీంతో 17,800 కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయని తెలిపారు. తాము బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలైందని.. ఈ కాలంలో 9 వేల కేసులను పరిష్కరించామని అన్నారు. మిగతా 8,800 కేసులు హియరింగ్‌కు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 30 జిల్లాల్లో కమిషన్‌ పర్యటించిందని వివరించారు. తమ కృషి ఫలితంగా 15 జిల్లాలు, 36 హెచ్‌వోడీల్లో పెండింగ్‌ కేసుల్లేకుండా పరిష్కరించగలిగామని తెలిపారు. ఈ రకంగా కమిషన్‌ వైపు నుంచి తాము చేయాల్సినదంగా చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే సమాచారాన్ని సూటిగా, స్పష్టంగా అడగాలనే ఆలోచన దరఖాస్తుదారుడికి, అంతే సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా సమాచారం ఇవ్వాలన్న బాధ్యత అధికారులకు ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలను, వారు సమాచారం అడిగే తీరును సానుకూల దృక్పథంతో చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీఐ సమాచారం కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులో ఉందని, అయితే ఇతర రాష్ట్రాల్లో ఎన్‌ఐసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు దాన్ని నిర్వహిస్తుండగా, మన రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలో అప్‌స్టీక్‌ టెక్‌ సొల్యూషన్స్‌ అనే ప్రయివేటు సంస్థకు దాన్ని అప్పగించటం శోచనీయమని అన్నారు. తెలంగాణలో కూడా ఎన్‌ఐసీలాంటి సంస్థలకే ఆ బాధ్యతలు అప్పగించాలంటూ ప్రతిపాదిస్తామని తెలిపారు.

పీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఢిల్లీలో అధికార పీఠంపై ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి(ప్రధాని)కి సంబంధించిన విద్యార్హతలపై కొందరు ఆర్టీఐ కింద సమాచారం అడిగారని గుర్తు చేశారు. దీంతో ఆ చట్టంపై కక్ష పెంచుకున్న ఆ ప్రభుత్వాధినేత ఆర్టీఐనే లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. మరికొందరు ఆర్టీఐ దుర్వినియోగం అవుతోందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలో లోపాలున్నాయనే కారణంతో మొత్తం చట్టాన్నే ఎత్తేయటం కరెక్టా? అని ప్రశ్నించారు. ఆర్టీఐ అనేది 2014 వరకు పాఠ్యాంశంగా ఉండేదని, కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిబట్టే ఆ చట్టంపట్ల పాలకుల వైఖరేంటో తెలుస్తోందన్నారు. మరోవైపు సమాచారం ఇవ్వటంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన కొందరు అధికారులు సైతం దానిపట్ల అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం స్థానంలో పదోపరకో ఇచ్చి దరఖాస్తుదారుణ్ని సంతృప్తి పరుస్తుండటంతో అసలైన ఆర్టీఐ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు, చిక్కుముళ్లను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఆర్టీఐ కమిషన్‌తోపాటు కార్యకర్తలపైనా, పౌర సమాజంపైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. పీఎఫ్‌ఆర్‌ఐ అధ్యక్షులు వి.యాదయ్య, పీజేఎమ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -