ఈ మనిషి ఫలానా మనిషని ఈ మనిషి పేరు ఇది కాదు ఇదని ఎలా గుర్తుపట్టగలం? ముఖం చూసే కదా! అంటే ఏ మనిషినయినా మనిషని గుర్తుపట్టడానికి, గుర్తుపెట్టుకోడానికి ముఖ్యం ముఖమే కదా. ముఖం లేని మనిషి అసలు మనిషే కాడుగదా. కనుక మనిషికి ముఖం వుండాల్సిందే. మరి అన్ని ముఖాలూ ఒక్కలా వుండవు. అన్ని ముఖాల్లోనూ వుండే వస్తువులు అవే అయినా వేరువేరుగా తీరుతీరుగా వుంటాయి కదా. ముఖానికి రెండు పక్కలా పాంటూ షర్టూ తగిలించుకునే కొక్కాల్లా రెండు చెవులుంటాయి. ఇంటి పై కప్పుకి నడిమధ్యన వుండే పిల్లర్‌లా ఓ ముక్కు వుంటుంది. దానికింద ఓ కలుగులా నోరు, కలుగులోంచి తొంగి చూసే ఎలుకలా నాలుక వస్తూ పోతూ ఆ పైన కనపడ్డ మనుషుల ముక్కూ చెవులూ నోరూ చూడటానికి ఒకటి చాలదని రెండు కళ్లు, వాటి మీద కోపం వస్తే వంకర తిరగడానికి బొమ్మలు అందరికీ అంటే అన్ని ముఖాలకీ వుంటాయి కానీ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోడానికి ఎక్కువ తక్కువ లావూ సన్నం వంటి తేడాలతో వుంటాయి.
మనుషులందరికీ ముఖాలిచ్చే వాడెవడో గాని కొందరి పట్ల పక్షపాతం చూపిస్తారు. కొందరికి అన్నీ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీవి ఇచ్చేచి నాలాంటి వాళ్లకి మాత్రం మరీ నాసిరకంవి, రెండో మూడో ఐదో నెంబర్‌వి ఇచ్చేవాడు అని బాధ, బెంగ, చింతతో చితికి పోయేవాడు నందనరావు.
చిన్ననాడే అంతా బానే వుంది వీడి ముఖం కానీ ముక్కే అని ముక్కే వాళ్లు కొందరు. అసలు ముక్కు అనేది ఉక్కుస్తంభంలా ఇంతలావుగా ఉండడమేమిటని ఆశ్చర్యపోయేవారు కొందరు. చిన్నప్పుడు అల్లరి చేస్తే వీడి ముక్కు కోసేస్తాననేవాడు తండ్రి. లోకంలో జనం అందరికీ కొన్ని బాధలు వచ్చిపోతుంటయి కానీ నందనరావుకి ఈ ముక్కు బాధ ఎప్పటికీ పోయేది కానేకాదు. ముఖంలో కొట్టవచ్చినట్టు కనపడే ముక్కు తప్ప అతని చెవులూ, నోరూ ఎవరికీ కనిపించేవే కాదు. నందనరావు పెరిగి పెద్దయిన కొద్దీ అది నీతో పాటు నేను అంటూ పెరగసాగింది. చిన్నప్పుడు స్నానం పోసిన దాది వీడి ముక్కును గట్టిగా ఒత్తి వుంటే ఇలా వుండి వుండేది కాదు అనేది వాడి బామ్మ. ఎవడి పోలిక వచ్చిందోనని వాపోయేది తల్లి.
ఇప్పుడివన్నీ అక్కర్లేదుకానీ రోజురోజుకీ ఈ ముఖంలో ముక్కు చూసేవాళ్లకు ఒక వింత వస్తువులా కనపడుతున్నదని అర్థం అవడం మొదలైన నాటి నుంచీ నందనరావుకు తన మీద తనకే పిచ్చికోపం వచ్చేది. కాలి గోరో, వేలి గోరో అయితే పీకి పారెయ్యగలడు కాని ముఖం నడిబొడ్డున వుండే ముఖ్యమైన ముక్కు కదా. పగవాడిక్కూడా ఇలాంటి అవస్త రాకూడదు అనుకునే అవస్త ఇది. కాలేజీ చదువుల నాటికి మెడని పావురంలా అటూ ఇటూ తిప్పి జుట్టుని అడ్జస్టు చేసుకునేవాడు కాని అద్దంలోకి చూస్తూ తల దువ్వుకోవడం మానేశాడు. జలుబు చేసినప్పుడు ముక్కు గొట్టంలోంచి గాలిలోపలికి దూరలేక నానా హంగామా చేసినప్పుడు రెండు చేతుల్తోనూ గట్టిగా పట్టి పీకి పారెయ్యాలనుకునేవాడు. కానీ అది లేకపోతే కళ్లజోడు ఏ బస్‌స్టాండ్‌లో నిలబడేను, అది లేకపోతే ఊపిరితిత్తుల్లో గాలి ఎవడు నింపేను అనుకుని గమ్మునుండేవాడు.
చదువు అయిపోయింది. సర్వీసు కమిషన్ పరీక్ష పాసయ్యాడు. ఉద్యోగంలో చేరాడు. ముఖంలోకి లగేజీలా గడ్డాలూ మీసాలూ వచ్చి చేరాయి. ముఖంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఒక్క ముక్కే ఏమీ మారలేదు. ఒక్కోసారి కల్లో కఠినమైన తపస్సు చేసేవాడు. ఒకడు ప్రత్యక్షమై ‘వత్సా! చాలించు ఇంక నీ తపస్సుకు మెచ్చుకుని వరమీయ వచ్చాను’ అని ఆనగానే మరో ఆలోచన లేకుండా నాకీ ముక్కు వద్దు దేవా అని అరిచేవాడు. తెల్లారి లేచాక కల్లో కనిపించిన దేవుడు ముక్కునేమైనా రిపేరు చేశాడా, కొంచెం అటూ ఇటూ చెక్కి బ్యూటిఫై చేశాడా అని చూసుకునేవాడు. కానీ తెల్లవారుఝామున వచ్చే కలలు కూడా అబద్దమే అవుతాయని ఫిక్సయిపోయాడు.
ఆఫీసులో తనతో పనివుండి వచ్చేవాళ్లు కూడా తన నోస్ కేసి అదోలా ఫేస్ పెట్టి చూసేవాళ్లు. అసలే అమ్మాయిల కరువొచ్చిందంటున్నారు. ఈ ముక్కున్న తన్ను ఏ అమ్మాయైనా పెళ్లి చేసుకునేనా? ఈ ముక్కుతో బ్రహ్మచారిగానే బతుకు ఎక్స్‌పైర్ అయిపోయేనా అని నిద్దర రాని రాత్రులు గడిపేవాడు. ఒక్కోసారి అనుకోకుండా అద్భుతాలు జరిగిపోతుంటయి కదా!
ఓ నాడు ఆఫీసుకి బయలుదేరుతూ అనుకోకుండా అద్దంలోకి చూశాడు. ఢామ్మని కింద పడ్డాడు. ముఖంలో ఉండాల్సిన ముక్కులేదు. అప్పుడెప్పుడో కల్లో కనిపించిన దేవుడితో నాకు ఈ ముక్కు వద్దు అన్నాడు. మరో మంచి ముక్కు ఇవ్వమని కోరలేదు. అంచేత ఇలా జరిగింది, ఓ మై గాడ్ అనుకున్నాడు. ఎట్లాగూ ముక్కు కనిపించదు కదా అని అద్దంలో ముఖం చూసుకున్నాడు ధైర్యంగా. హమ్మయ్యా! పీడా వదిలింది. ఇన్నేళ్ల నుంచి హింసించిన ముక్కు ఇక లేదు అనుకుని ఆనందపడ్డాడు. ‘ముక్కు లేదుగా, ముక్కే లేదుగా’ అని పాట కూడా పాడాడు. ఆఫీసు సంగతి వదిలేసి ఆ రోజంతా ముక్కు లేని ముఖం చూడసాగాడు. మొదట్లో బానే అనిపించినా చూడగా చూడగా ముక్కులేని ముఖం గాలిపీల్చుకునే పెద్ద రంధ్రాలతో వికారంగా కనిపించసాగింది. ముక్కు లేకుండా ముఖం ఏమిటి నా ముఖం! బాగుందో బాగాలేదో! ఈ ముక్కనేదే లేకుండా నన్ను ఎవరు గుర్తుపడతారు. అసలు ఆఫీసులోకి రానిస్తారా! ఎవర్రా నువ్వు అని బయటకు గెంటేస్తారా? సాయంత్రం అయ్యేసరికి నందనరావు ఆలోచనల్లో మార్పు వచ్చింది. నా ముక్కు ఇన్నాళ్లు నా ముఖంలో వున్న ముక్కు ఎవరేం అనుకున్నా అది నా ముక్కే. నా ముక్కు నాకే స్వంతం. ముక్కు విలువ తెలిసొచ్చింది. మన కోసం మన ముక్కు మన గాలి మనం పీల్చుకోవడం కోసం మన ముక్కు అని అనుకుంటుండగానే నందన్ ఆఫీసుకు రాలేదేం అంటూ ఇంట్లోకి వచ్చాడు అతనితో పనిచేసే మిత్రుడు. హఠాత్తుగా వచ్చిన వీడు ముక్కులేని నా ముఖాన్ని చూసి మూర్చపోతాడేమో అనుకున్నాడు కానీ ఆ వచ్చినవాడు ఏంట్రా ముక్కేంటి అంత ఎర్రగా కందిపోయింది అనడంతో ఉలిక్కిపడి లోపలికి వెళ్లి అద్దంలో చూసుకున్నాడు. ముక్కు ఎప్పటిలాగే ఎలా వుండేదో అలాగే ఉంది. అంతా తన భ్రమ, చిత్త చాపల్యం, పదే పదే అరచేత్తో రాశాడేమో ఎర్రబడింది. మొత్తానికి ముక్కు ఎక్కడికీ పోలేదు. తప్పదు నా ముక్కు ముక్కే వదిలించుకోలేం. జీవితమంతా దాంతో అడ్జస్టయిపోవలసిందే అనుకుంటూ బయటకు వచ్చాడు నందన్ ఆననందంగా!
మన రాజ్యాంగ వ్యవస్థలో ఎన్నో లోపాలు వుండవచ్చు. ప్రభుత్వాలు నడిపేవారిలో అనేక వికారాలు వుండవచ్చు. కానీ వ్వవస్థను కాదనలేం. ప్రభుత్వాలను వద్దనలేం. ముక్కు కోసుకోలేం!!
– చింతపట్ల సుదర్శన్
9299809212
ఇదింతేలే!
- Advertisement -
- Advertisement -



