Sunday, October 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలునా కెరీర్‌లో సూపర్‌ స్టార్‌గా నిలబెట్టిన సినిమా అదే : విజయశాంతి

నా కెరీర్‌లో సూపర్‌ స్టార్‌గా నిలబెట్టిన సినిమా అదే : విజయశాంతి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: తన కెరీర్‌లోనే సూపర్‌ స్టార్‌గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన చిత్రం ‘ప్రతిఘటన’ అని సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఏడాది అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి మూవీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి. కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రానికి ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు. అయితే 1990ల్లో విజయశాంతి స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న విజయశాంతి తాను నటించిన మూవీని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లోనే సూపర్‌ స్టార్‌గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన చిత్రమని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 1985 అక్టోబర్‌ 11న తాను నటించిన ప్రతిఘటన మూవీలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్‌ చేశారు.

ఈ దుర్యోధన దుశ్శాసన పాటను అందించిన శ్రీ వేటూరి గారికి, ఈ పాట పాడిన ఎస్‌ జానకి అమ్మకు, మాటల రచయిత ఎంవీఎస్‌ హరనాథ్‌ రావు గారికి.. విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ప్రతిఘటన సినిమా తర్వాత లేడీ సూపర్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ప్రజల నుంచే వచ్చిందని గతంలోనే విజయశాంతి వెల్లడించారు. అలాగే లేడీ జాకీ చాన్‌, లేడీ అమితాబ్‌ అని కూడా తనను పిలిచేవారని గత ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా విజయశాంతి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -