రూ.2,500 కోట్లకు కేంద్రం ఆమోదం
ఈ నెలాఖరులోగా రూ.1,000 కోట్లు విడుదల
ఫిబ్రవరిలో మిగిలిన మొత్తం
సంక్రాంతి కానుకగా రూ.277 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ
గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ.2,500 కోట్ల పెండింగ్ నిధులకు ఆమోదం లభించింది. అందులో ఈ నెలాఖరులోపు రూ. వెయ్యి కోట్లను విడుదల చేయనున్నట్టు సమాచారం. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని తెలుస్తోంది. ఏడాదిన్నరగా కేంద్రం నుంచి నయా పైసా రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం గ్రామాలకు నిధులు కేటాయించ లేదు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తికి తోడు హరితహారం, శ్మశానవాటికల నిర్మాణం లాంటి కొన్ని పనులను విధిగా చేయాలని అధికారులు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఈ వ్యవహారం ఇబ్బందిగా మారింది. పాత సర్పంచ్‌లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, కార్యదర్శులు చేసిన అప్పుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులకు గ్రీన్ సిగల్ లభించింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం సంక్రాంత్రి కానుకగా జీపీలకు రూ.277 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు పారదర్శకంగా నిధులను వినియోగించు కునేలా పంచాయతీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
డిజిటల్ ప్రక్రియ తప్పనిసరి
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరవాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది. ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్) పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి. అదే సమయంలో ఈ గ్రామ్‌స్వారాజ్ పోర్టల్‌లో కూడా ఆ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. నిధుల వినియోగానికి మేకర్, చెకర్‌గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను ఈ గ్రామ్‌స్వారాజ్‌లో నమోదు చేసి సంబంధిత మండల అభివృద్థి అధికారి (ఎంపీడీవో) ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు క్లాస్-3 డిజిటల్ సిగేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని పేర్కొంది. సైనింగ్, ఎన్‌క్రిప్షన్ సౌకర్యంతో పాటు యూఎస్‌బీ టోకెన్ కూడా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను జెమ్ పోర్టల్, ఈ-ప్రోక్యూర్‌మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా వెంటనే సేకరించి, నమోదు ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ డైరెక్టర్ శతి ఓజా డిస్ట్రిక్ పంచాయతీ ఆఫీసర్ (డీపీవో)లకు ఆదేశాలు జారీ చేశారు.
జీపీలకు రూ.277 కోట్లు విడుదల
గ్రామపంచాయతీలకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం రూ.277 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం ప్రజాభవన్‌లో ఆర్థికశాఖ అధికారుల సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



