Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆసరా పింఛన్‌ పెంచాలి

ఆసరా పింఛన్‌ పెంచాలి

- Advertisement -

కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలి
సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌
హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా

నవతెలంగాణ-సిటీబ్యూరో
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆసరా పింఛన్‌ పెంచాలని, అలాగే కొత్త దరఖాస్తుదారులకు వెంటనే పెన్షన్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 12 రకాల ఆసరా పింఛన్లు అందిస్తోందని తెలిపారు. అయితే అర్హులైన లక్షలాది మంది పేదలు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారని తెలిపారు. కొత్త దరఖాస్తుదారులకు పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చే రూ.2,016 పెన్షన్‌ను రూ.4,000కు, వికలాంగులకు రూ.4,016 పెన్షన్‌ను రూ.6,000కు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీనిచ్చిందని గుర్తుచేశారు. రెండు సంవత్సరాలైనా ఆ హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పింఛన్‌ పెంచి అమలు చేయాల ని డిమాండ్‌ చేశారు. ఐద్వా హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి వై.వరలక్ష్మి, సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మహేందర్‌ ప్రసంగించారు. ధర్నా అనంతరం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్‌.. వారి విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో మహిళా సంఘం నగర అధ్యక్షులు ఏ.పద్మ, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -