Sunday, October 26, 2025
E-PAPER
Homeజాతీయంరోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం

రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం

- Advertisement -

– కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌
నవతెలంగాణ-కర్నూలు క్రైమ్‌

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద వేమూరి కావేరి ప్రయివేటు బస్సు దగ్ధమైన ఘటనలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు దగ్ధం ఘటనలో 19 మంది సజీవ దహనం కావడం, ద్విచక్ర వాహనదారుడు శివశంకర్‌ మృతి చెందడం తెలిసిందే. వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టలేదని, రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన కర్నూలులో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం… ఈ ద్విచక్ర వాహనాన్ని శివశంకర్‌ డ్రైవ్‌ చేస్తుండగా, వెనకాల ఎర్రి స్వామి అలియాస్‌ నాని కూర్చున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో స్వామిని పలు కోణాల్లో విచారించారు. లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటలకు వీరిద్దరూ బయలుదేరారు. స్వామిని ఇంటివద్ద వదలడానికి తుగ్గలికి పల్సర్‌ బైక్‌పై శివశంకర్‌ వెళ్తున్నాడు. వారు మార్గమధ్యలో కియా షోరూం వద్దగల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద అర్ధరాత్రి సుమారు 2.24 గంటల సమయంలో రూ.300 పెట్రోలు పోయించుకున్నారు. ఆ తర్వాత బయలుదేరిన కొద్దిసేపటికి చిన్నటేకూరు సమీపంలో బైక్‌ స్కిడ్‌ అయింది. దీంతో రోడ్డుకు కుడిపక్కన ఉన్న డివైడర్‌ను ఢకొీట్టడంతో బైక్‌ను నడుపుతున్న శివశంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ వెనకాల ఉన్న స్వామి చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటనా స్ధలం దగ్గర రోడ్డు మధ్యలో నుంచి శివశంకర్‌ను స్వామి బయటకు లాగి శ్వాస చూసి చనిపోయాడని నిర్థారించుకునేలోపే, రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను తీద్దామనుకునే సమయంలోనే ఈ బైక్‌ను కావేరి ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో స్వామి బయపడి తన సొంతూరు తుగ్గలికి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారనీ, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -