నవతెలంగాణ – అచ్చంపేట
కుమ్మెర జాతరలో జరిగిన ఘటన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్ధo సైదులు, సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి.రాములు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం సీపీఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు టౌన్ సెక్రెటరీ బి రాములు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్ధo సైదులు మాట్లాడారు. నాగర్ కర్నూల్ మండలం కుమ్మర గ్రామంలో ఫిబ్రవరి 18న దళిత రజక కుటుంబం పై దాడి సంఘటనలో రెండు నెలల చిన్నారి మృతి చెంది ఆరు రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని కేవలం ముగ్గురిని అరెస్టు చేసి మిగతా నిందితులను అరెస్టు చేయకుండా ఉండటం వలన ప్రజా పాలనలో పెత్తందారుల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోవడానికి నిదర్శనంగా ఉన్నాయని విమర్శించారు.
నాగర్ కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా ప్రభుత్వ అధికారులు తక్షణమే కుమ్మర గ్రామాన్ని సందర్శించి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి అంటరానితనం వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వ తరపున చైతన్య కార్యక్రమాలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వ పరంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రక్షక యంత్రాంగం విచారణ తొందరగా చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), సిఐటియు నాయకులు తారా సింగ్, రాము, గోపాల్, వెoకటయ్య, పర్వతాల్, రజిత, లక్ష్మి, సువర్ణ, బాలయ్య, రేణయ్య తదితరులు పాల్గొన్నారు.



