– రాష్ట్రంలో ఏటా 500 మందికిపైగా మృతి
– నిన్న కూకట్‌పల్లి, నేడు జీడిమెట్ల
– అస్వస్థతకు గురవుతున్న వేలాది మంది
– కల్తీ కట్టడిలో ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యం
– జీహెచ్‌ఎంసీ పరిధిలో కల్లు నిషేధం?
కల్తీకల్లు పేదలు, బడుగు బలహీన వర్గాలకు మృత్యు పాశమవుతోంది. హైదరాబాద్ నగరంలో రెక్కాడితే డొక్కాడని రోజు వారీ కూలీలు, మురికి వాడల్లో నివసించే ప్రజలు ఈ మహమ్మారికి బలవుతున్నారు. నిన్న కూకట్‌పల్లి నేడు జీడిమెట్ల ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కూకట్‌పల్లి ఘటనలో 9 మంది మరణించగా, 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం జీడిమెట్లలోని రాంరెడ్డి నగరలో కల్లీకల్లు తాగి నిజామాబాద్‌కు చెందిన దంపతులు అస్వస్థతకు గురి కావడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం 4,060 టాడి కో ఆపరేటీవ్ సొసైటీలు, 4,697 టాడీ కోఆపరేటీవ్ షాపులు, 160 డిపోలున్నాయి. టాడి కో ఆపరేటీవ్ సొసైటీల్లో సభ్యత్వం ఉన్న గీత కార్మికులు కల్లు గీసి అమ్ముతారు. సొసైటీల నుంచి కల్లును కొనుగోలు చేసి మండల, తాలుకా, జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో ఉన్న కల్లు దుకాణాలు (కంపౌండ్) విక్రయిస్తాయి. కల్లు దుకాణాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో అనుమతి పొందినవి 97 ఉండగా, లైసెన్స్ లేకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వందకు పైగా నడుస్తున్నాయి. రూరల్ ప్రాంతాల్లో ఉండే టాడి కో ఆపరేటీవ్ సొసైటీల్లోని షాపుల్లో (మండువాలు) కల్లు తాగి మృతి చెందిన దాఖాలాలు లేవు. ఎక్కడైతే చెట్లు లేకుండా (హైదరాబాద్ లాంటి నగరాల్లో) కల్లు దుకాణాలు నడుపుతున్నారో అక్కడే కల్తీ కల్లు రాజ్యమేలుతోంది. వంద లీటర్ల ఒరిజనల్ కల్లును సొసైటీల వద్ద కొనుగోలు చేసి అందులో రసాయనాలు కలిపి దాన్ని వెయ్యి లీటర్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం ఈ మహమ్మారి వల్ల ఏటా రాష్ట్రంలో 500 మందికి పైగా మృతి చెందుతున్నారు. అలాగే వేలాది మంది అస్వస్థతకు గురై రోగాల బారిన పడుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో కల్తీ కల్లు జాడ్యానికి బానిసలుగా మారి వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా జరిగిన కూకట్ పల్లి ఘటనలో 9 మంది మృతి చెందడం, 50 మంది వరకు అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. కల్తీ కల్లు బారిన పడి ఇంత మంది ఒకే సారి మరణించినా అటు ఆబ్కారీ శాఖ గాని ఇటు ప్రభుత్వం గాని ఇప్పటి వరకు నోరు మెదపలేదు.
అలవాటు పడితే అంతే సంగతులు…
రోజువారి కూలీలు, పేద మథ్యతరగతి ప్రజలు ఎక్కువగా కల్లీ కల్లుకు బానిసలుగా మారుతున్నారు. ఒక్కసారి దీనికి అడిక్ట్ అయితే అంతే సంగతులు… జీవితాంతం దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రతి రోజూ చుక్క నోట్లో పడకుంటే మనిషి మనిషిగా ఉండడు. మత్తు రావడానికి ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్, డైజోపామ్, అల్ప్రాజోలమ్ వంటివి కలిపి కల్లును విక్రయిస్తుండడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాళ్లు, చేతులు కంట్రోల్ తప్పుతాయి. ఆలోచనలు మొద్దుబారి పోతాయి. క్రమంగా మానసిక రోగులుగా మారి పోతున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో నిషేధం?
రసాయనాలు కలిపిన కల్లును విక్రయిస్తుండటం వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో 2004లో కల్లు కంపౌండ్లను మూసేసింది. పదేండ్ల పాటు ఈ నిషేధం కొనసాగింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కల్లు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడాని అనుమతిస్తూ జీవో 24ను జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతన్న కల్తీ కల్లు ఘటనలతో సర్కార్ అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కల్లును నిషేధించాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లాంటి నగరాల్లో కల్లు విక్రయం వల్ల టాడి టాపర్ సొసైటీ, ట్రీ ఫర్ ట్రేడర్స్ (టీఎప్‌టీ) సభ్యులకు ఎలాంటి ఉపయోగం లేదు. సొసైటీల నుంచి కల్లును కొనుగోలు చేసి రసాయనాలు కలిపి అమ్మే మధ్యవర్తులకే ఇది ఆర్థికంగా లబ్ది చేకూరుస్తోందని సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే సర్కార్ నిషేధం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
కల్తీ పట్టని ఎక్జైజ్ శాఖ…
కల్లు విక్రయాలపై ఎప్పటికప్పుడు నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్లతో పాటు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో యథేచ్ఛగా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లి లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారు. ఈ తర్వాత అటు వైపు చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.