Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంన్యాయవాదుల రక్షణకే అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లు

న్యాయవాదుల రక్షణకే అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లు

- Advertisement -

మంత్రి శ్రీధర్‌బాబు శాసనసభలో ఆమోదం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ బిల్లు తీసుకొచ్చినట్టు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతులు హత్యకు గురయ్యారని చెప్పారు. పట్టపగలే వారిని హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల ప్రోద్బలంతోనే వారు హత్యకు గురైనట్టు విమర్శించారు .అప్పట్లో వామనరావు కుటుంబసభ్యులకు న్యాయం జరగలేదనీ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటమే ఈ బిల్లు లక్ష్యమని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం, రక్షణకు మా ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తున్నదని చెప్పారు. సామాజిక న్యాయానికి సర్కారు కట్టుబడి ఉందన్నారు. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. పీపీలు, స్టాండింగ్‌ కౌన్సిళ్లు, ఇతర లీగల్‌ నియామకాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం సామాజిక న్యాయం పాటించలేదని గుర్తు చేశారు. లెక్కలు తీస్తే అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. ఈ వివక్షతలపై సభలోని బీజేపీ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 414 మంది పీపీలు ఉంటే, బీసీలు 126, ఎస్సీలు 59, ఎస్టీలు 25 మంది ఉన్నారని గుర్తు చేశారు. ఏపీపీల్లో ఓసీలు 24 మంది, బీసీలు 37 మంది, ఎస్సీలు 16, ఎస్టీలు మూడు, మైనార్టీ వర్గం నుంచి ఒకరు పనిచేస్తున్నారని చెప్పారు. మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా బార్‌ అసోసియేషన్‌ హాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. న్యాయ నిర్మాణ్‌ ప్రాజెక్టు కింద వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. అనంతరం చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలిన వాళ్లలో న్యాయవాదులే ఉన్నారని చెప్పారు. మహిళా న్యాయవాదుల సంఖ్య పెరుగుతున్నదని, వాళ్ల విషయంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అడ్వకేట్ల అకాడమీ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల కోరికగా ఉందనీ, దానిని ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. జూనియర్‌ అడ్వకేట్లకు స్టయిఫండ్‌ను రూ. 5000 నుంచి రూ. 15000 పెంచాలని కోరారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్‌, ఆదినారాయణ, మహ్మద్‌ మోబిన్‌, రామ్మోహన్‌రెడ్డి, పాయల్‌శంకర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ అడ్వకేట్ల రక్షణ బిల్లును సభలో ప్రవేశపెట్టడం శుభదినమని చెప్పారు. జడ్జీల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు తెస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. చర్చల అనంతరం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అడ్వకేట్ల రక్షణ బిల్లును సభలో పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందుకు మంత్రి శ్రీధర్‌బాబు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -