Saturday, September 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వ విధానాల ఫలితమే వ్యవసాయ సంక్షోభం

ప్రభుత్వ విధానాల ఫలితమే వ్యవసాయ సంక్షోభం

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు

నవతెలంగాణ-వరంగల్‌
మన దేశంలో మూడింట రెండొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు. తరగతులకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. సరళీకరణ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను వేగవంతం చేయడంలో విఫలం చెందాయన్నారు. వ్యవసాయంలో అతి తక్కువ వృద్ధిరేటు ఉన్న కారణంగా సగానికి పైగా వ్యవసాయ కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయని, దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిందని తెలిపారు. దేశంలో వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణ వ్యవసాయ నిర్మాణంలో ప్రభుత్వ పెట్టుబడుల కొరత వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ గ్రామీణ అసమానతలు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉంది. చిన్న, సన్నకారు రైతులకు అందాల్సిన ఆర్థిక వనరులను ధనిక వర్గాలకు, బడా కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వాలు మళ్ళించాయని తెలిపారు.

ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, గత మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలే ప్రధాన కారణమన్నారు. దాంతో ఏర్పడిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం, లక్షలాది మంది రైతుల ఆత్మహత్యలకు దారి తీసిందని తెలిపారు. పెట్టుబడికి అయిన ఖర్చుకు అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరగా హామీ ఇవ్వాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని, సన్న-చిన్నకారు రైతులకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ కార్మికులకు రెట్టింపు పని దినాలు, రెట్టింపు వేతనాలను అమలు చేయాలని కోరారు. గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, రైతుల నుంచి బలవంతంగా భూసేకరణను నిలిపివేయాలని, భూ సంస్కరణలను చేపట్టాలని కోరుతూ పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, డి. బాల్‌ రెడ్డి, మాటూరి బాలరాజుగౌడ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదినేని రమేష్‌, బుర్రి శ్రీరాములు, శెట్టి వెంకన్న, వరంగల్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుచ్చకాయల కృష్ణారెడ్డి, ఈసంపల్లి బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -