Monday, January 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహక్కుల కోసం నినదిస్తూ… మనువాదంపై పోరు సల్పుతూ కదం తొక్కిన ఐద్వా దండు

హక్కుల కోసం నినదిస్తూ… మనువాదంపై పోరు సల్పుతూ కదం తొక్కిన ఐద్వా దండు

- Advertisement -

ప్రదర్శనకు వేలాదిగా తరలొచ్చిన మహిళలు
ర్యాలీ అగ్రభాగంలో మరియం ధావలే, పి.కె. శ్రీమతి టీచర్‌, మల్లు లక్ష్మి, అరుణజ్యోతి, తదితరులు
హక్కుల కోసం పోరాటాలే మార్గమని పిలుపు
ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన, ఆడిపాడిన అగ్రనేతలు
మల్లు స్వరాజ్యం స్వగ్రామం నుంచి బోనాలు తీసుకొచ్చిన మహిళలు
ఎస్వీకే నుంచి నారాయణగూడ మీదుగా బస్‌భవన్‌ గ్రౌండ్‌ వరకు ర్యాలీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హక్కుల కోసం నినదిస్తూ…మనువాదంపై పోరు సల్పుతూ…తమకు సాధికారత కావాలంటూ మహిళా లోకం గర్జించింది. ఐద్వా ఆధ్వర్యంలో దండుగా కదిలి నినాదాల ద్వారా మోడీ సర్కారుకు గట్టి హెచ్చరికలు పంపింది. మనుధర్మం రుద్దొద్దనీ.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని నినదించింది. ఈ ధిక్కార స్వరం భవిష్యత్‌ ఉద్యమాలకు నాంది అని తేల్చిచెప్పింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు ముందుగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ ప్లైఓవర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ మీదుగా బస్‌భవన్‌ పక్కనున్న ఆర్టీసీ గ్రౌండ్‌ వరకు వేలాది మంది మహిళలతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఆ ప్రదర్శన అగ్రభాగంలో ఐద్వా ప్యాట్రన్‌ బృందాకరత్‌, ఐద్వా అఖిల భారత అధ్యక్షులు పీకే. శ్రీమతి టీచర్‌, ప్రధాన కార్యదర్శి మరియం దావలే, జాతీయ నేతలు సుభాషిణీ అలీ, పుణ్యవతి, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఆలిండియా ఆఫీస్‌ బేరర్లు, ఇతర నేతలు అగ్రభాగంలో నడిచారు.



14వ జాతీయ మహాసభలకు సూచికగా 14 భారీ ఐద్వా పతాకాలను కార్యకర్తలు చేబూని ముందుకు కదిలారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐద్వా సంఘం ప్రతినిధులు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నారు. మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానాలను ఎండగట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి…సమాన హక్కు లివ్వండి.. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్య్రం కావాలి’ అంటూ పెద్దపెట్టున నినదించారు. హక్కుల కోసం పోరాటాలే మార్గమని పిలుపునిచ్చారు. ప్రదర్శన అగ్రభాగంలోని పలువురు నాయకులు పోరాట చైతన్య పాటలకు పదం కలుపుతూ… స్టెప్పులేస్తూ ర్యాలీలో జోష్‌ తీసుకొచ్చారు. ఐద్వా కార్యకర్తలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకున్నది. మల్లు స్వరాజ్యం, మల్లు లక్ష్మి సొంతూరైన రాయినగూడెం నుంచి మహిళలు బోనాలను తీసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -