Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయందిగ్విజయంగా ఐద్వా మహాసభలు

దిగ్విజయంగా ఐద్వా మహాసభలు

- Advertisement -

సభలకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు
మహాసభల నిర్ణయాలతో పోరాటాలకు శ్రీకారం : విలేకర్ల సమావేవంలో పుణ్యవతి, మల్లు లక్ష్మి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ నెల 25నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ మహాసభలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్టు ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు ఎస్‌ పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి తెలిపారు. ఈ సభల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఐద్వా సభల విజయవంతానికి మహాసభల ఆహ్వాన సంఘం నేతలు, సభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు, వాలంటీర్లు తమ శక్తికి మించి కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సహకారం మరువలేనిదని అన్నారు. జీహెచ్‌ఎంసీకి చెందిన పారిశుధ్య కార్మికులు అహర్నిషలు పనిచేశారని ప్రశంసించారు. మహాసభల విజయవంతానికి 23 కమిటీలు వేశామనీ, ఆ కమిటీలన్నీ సమర్థవంతంగా పనిచేశాయని పేర్కొన్నారు. బహిరంగ సభతో పాటు, మహాసభలలో అద్భుత కళాప్రదర్శనలు ఇచ్చిన ప్రజానాట్యమండలి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కర్తవ్యాల అమలుకు సమరశీల పోరాటాలు
ఈ మహాసభలో పలు అంశాలపై కమిషన్లు వేసి చర్చించామనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉందనీ, వాటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో సమరశీల పోరాటాలు నిర్వహించాలని మహాసభ నిర్దేశించిందని ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు ఎ పుణ్యవతి తెలిపారు. మహాసభలకు కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్‌, త్రిపుర, అండమాన్‌ తదితర 26 రాష్ట్రాల నుంచి 800మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. సమాజంలో వస్తున్న మార్పుల వల్ల గతం కంటే మహిళా ఉద్యమాల ప్రభావం పెరిగిందనీ, ఈ నేపథ్యంలోనే మహాసభలలో పలు మహిళా సమస్యలపై పోరాట కర్తవ్యాలను తీసుకున్నట్టు వివరించారు. ఏడు కమిషన్‌ పత్రాలను మహాసభ చర్చించిందనీ, వాటిని ఏకగ్రీవంగా సభ ఆమోదించిందని తెలిపారు.

1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడే నాటికి తొమ్మిది రాష్ట్రాల్లో ఉంటే.. ఇప్పుడు 26 రాష్ట్రాలో సంఘం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, సాంఘీక, సాంస్కృతిక రంగాల్లో మహిళా ఉద్యమాల జోక్యం పెరగాల్సిన అవసరాన్ని మహాసభ గుర్తించిందని తెలిపారు. సామ్రాజ్యవాదం దురహంకారంతో వెనుకబడిన దేశాలపై ముఖ్యంగా పాలస్తీనాపై దాడులు చేయటం వల్ల పేదలు, అందులో మహిళలు, చిన్నారులు చనిపోతున్నారనీ, అక్కడ హృదయ విదయకర దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఉన్న ఉపాధికి ఎసరు పెట్టారని విమర్శించారు.

ఉపాధి రహిత విధానాల వల్ల మహిళలు తీవ్ర వేదనకు గురికావాల్సి వస్తున్నదని చెప్పారు. మనువాద భావవాద విధానాలతో దేశంలోని పౌరుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీ జీ ఆర్‌ఏఎంజీ చట్టాన్ని తీసుకొచ్చి పేదల ఉపాధికి గండి కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పెద్దఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో వీరితో పాటు అరుణజ్యోతి, సీనియర్‌ నాయకులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శులు కేఎన్‌ ఆశాలత, బుగ్గవీటి సరళ పాల్గొని మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -