నవతెలంగాణ – తుంగతుర్తి
రైతులకు మెరుగైన సేవలు అందించడమే సహకార సంఘాల లక్ష్యం అని,సొసైటీ చైర్మన్,ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. శుక్రవారం సొసైటీ ఆవరణంలో సహకార వారోత్సవాల సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా సహకార వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సహకార సంఘం కుటుంబ వ్యవస్థ లాంటిదని,కుటుంబ సభ్యులంతా కూర్చొని చర్చించుకున్నట్లుగా,సంఘ సభ్యులంతా ఒకచోట చేరి చర్చించుకునేందుకు సహకార వారోత్సవాలు దోహదపడతాయన్నారు.
సంఘంలో ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి,ఇకపై చేయాల్సిన కార్యాచరణలపై చర్చించుకునేందుకే సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు సొసైటీ ద్వారా సకాలంలో అందించడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. మండల రైతుల,సొసైటీ సభ్యుల సమిష్టి కృషితోనే సహకార సంఘం అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మోడం శ్రీలత,డైరెక్టర్లు పెండెం యాదగిరి, రామచంద్రు, బిక్షం రెడ్డి, రామనరసమ్మ, ఈదప్ప, రవీందర్ రెడ్డి సొసైటీ సీఈవో యాదగిరి సిబ్బంది మహేష్, ఉమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.



