యాదాద్రిభువనగిరి కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష, వంటావార్పు
త్రిబుల్ ఆర్‌లో విలువైన భూములు కోల్పోతున్న రైతులు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
త్రిబుల్ ఆర్‌లో రైతులు విలువైన, సాగు యోగ్యమైన భూములు కోల్పోతున్నారని, ప్రస్తుత అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్రిబుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి సామూహిక నిరాహార దీక్ష- వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 8 మండలాలు 43 గ్రామాల్లోని వందలాది ఎకరాల విలువైన సాగు యోగ్యమైన భూములను రైతులు కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికే రైతులు బస్వాపురం రిజర్వాయర్, కాల్వలు, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారులు, హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు, వైటీడీఏ పేరిట భూములు కోల్పోయి తీవ్ర మనోవేదనతో అనేకమంది ప్రాణం కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం త్రిబుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చి.. భూనిర్వాసితులకు భూమికి బదులు భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్ ధరకు అదనంగా మూడింతల రేటును కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ”బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా రూపొందించిన త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మేము అధికారంలోకి వస్తే మారుస్తామని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒప్పించలేని పరిస్థితులలో వారి పదవులకు రాజీనామా చేసి త్రిబుల్ ఆర్ నిర్వాసితుల పక్షాన పోరాడాలి” అని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించతలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అశాస్త్రీయంగా ఉందన్నారు. దాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఓఆర్‌ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉండాలని మొదటి అలైన్‌మెంట్‌లో ప్రకటించిన ప్రకారం ఎందుకు అమలు చేయడం లేదు? ఎవరి ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ను మార్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, త్రిబుల్ ఆర్ నిర్వాసితుల నాయకులు అవిశెట్టి పాండు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, గంగదేవి సైదులు, గడ్డం వెంకటేష్, దొంతగాని పెద్దులు, శ్రీనివాస రెడ్డి, నాయకులు పల్లెర్ల అంజయ్య, వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు, లావుడియ రాజు, వడ్డేబోయిన వెంకటేషం, టేపాక శివ, లలిత పాల్గొన్నారు.
అలైన్‌మెంట్ మార్చాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES