జూబ్లీహిల్స్ ఫలితం నిరుత్సాహపరిచింది
మరింత బలంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
ఓటేసిన ప్రజలకు, అవిశ్రాంతంగా కృషి చేసిన నాయకులకు ధన్యవాదాలు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు ప్రకటించారు. అనుభవం లేకున్నా ఎన్నికల్లో పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించిన మాగంటి సునీతను ఆయన అభినందించారు. జూబ్లీహిల్స్ ఫలితం తమను నిరుత్సాహపరిచిందని చెప్పారు. రెండేండ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో ఎన్నికల్లో తమ పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలు గమనించారని అన్నారు.
బీఆర్‌ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలూ, ఏజెన్సీలు ప్రకటించాయని గుర్తు చేశారు. ఈ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని వివరించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ అని ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. దీన్ని సానుకూల అంశంగా పరిగణిస్తామని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు ఏడు ఉప ఎన్నికలు జరిగాయనీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఒక సీటులోనూ గెలవలేదని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఒకటి, రెండు కార్పొరేటర్లకే పరిమితమైందని చెప్పారు. ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని అన్నారు. కులం, మతం పేరుతో రాజకీయం చేయలేదన్నారు. ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారం చేశామని వివరించారు. తాము పదేండ్లలో జూబ్లీహిల్స్‌లో రూ.5,328 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ ఎగ్గొట్టిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన బాకీ కార్డు రూపంలో ప్రజల వద్దకు వెళ్లామని అన్నారు.
హైడ్రా నుంచి మొదలుకుని ఆటో డ్రైవర్ల సమస్యల వరకు అనేక అంశాలను ప్రచారం చేశామన్నారు. తమ ఒత్తిడి కారణంగానే ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో అజహరుద్దీన్‌కు స్థానం దక్కిందని వివరించారు. కాంగ్రెస్ అక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈసీ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఫిర్యాదులు చేశామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లున్నాయని చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని అన్నారు. ఈ ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకుంటామని చెప్పారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం ఫలించిందని చెప్పారు. ఆర్‌ఎస్ బ్రదర్స్ (రేవంత్‌రెడ్డి, బండి సంజరు) సమీకరణం కలిసొచ్చిందని అన్నారు. ఈ ఫలితాలను చూసి నిరాశ చెందబోమనీ, ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.
కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేదాకా విశ్రమించబోమని అన్నారు. లగచర్ల నుంచి అనేక కాంగ్రెస్ అరాచకాలు, అక్రమాలు, అవినీతిని ఎండగట్టామని వివరించారు. పశ్చిమబెంగాల్‌లో మాదిరిగా ఇక్కడ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం సీఎం రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగారని అన్నారు. పది స్థానాల్లో ఉప ఎన్నికలు వసే ఎలా ఎదుర్కొంటారోనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడ తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు జి జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నవీన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, బాల్క సుమన్ పాల్గొన్నారు.



