ఇదీ జీఎస్టీ అసలు స్వరూపం
కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య భారీ ఆర్థిక అంతరం
చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ
రాష్ట్రాలను కేంద్రం లూటీ చేస్తున్నదంటూ ఆగ్రహం
బిల్లును ప్రతిపాదించిన మంత్రి జూపల్లి.. సభ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వస్తు సేవల బిల్లు (జీఎస్టీ) రూపంలో ప్రతి ఏటా తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న సొమ్ముకు, అక్కడి నుంచి తిరిగి రాష్ట్రానికి వస్తున్న సొమ్ముకు మధ్య భారీ ఆర్థిక అంతరం ఉన్నదని శాసనసభలో పలు పార్టీలకు చెందిన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ పేరుతో కేంద్రం.. రాష్ట్రాలను లూటీ చేస్తున్నదని వారు ఆక్షేపించారు. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా మోడీ సర్కార్ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు.
అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ కొనసాగుతున్న క్రమంలో ఎంఐఎం-బీజేపీ, కాంగ్రెస్-బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఒకానొక దశలో బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు ఎదురుదాడికి దిగటంతో వారు వెనక్కి తగ్గక తప్పలేదు. సోమవారం శాసనసభలో ‘తెలంగాణ వస్తు సేవల పన్ను చట్టం-2017 సవరణ బిల్లు’ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపాదించారు. దీనిపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, ఆ పార్టీ సభ్యుడు పాయల్ శంకర్, కాంగ్రెస్ సభ్యులు మదన్‌మోహన్, సూర్యనారాయణ, దానం నాగేందర్ మాట్లాడారు.
రాష్ట్రాల వాటా పెంచాం-బీజేపీ సభ్యులు
ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే కేంద్రం…జీఎస్టీని తీసుకొచ్చిందని అన్నారు. ఆ కౌన్సిల్‌లో కూడా అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ వాస్తవాలను పక్కనబెట్టి కేంద్రంపై, ప్రధాని మోడీపై విమర్శలు చేయటం తగదని హితవు పలికారు. పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ జీఎస్టీ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తోందని అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని గుర్తుచేశారు. ఈ దశలో దానం నాగేందర్ జోక్యం చేసుకుని కేంద్రానికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం సరికాదని అన్నారు. సభ నియమావళిని తెలుసుకుని మాట్లాడాలంటూ బీజేపీ సభ్యులనుద్దేశించి చెప్పారు.
పొంతనలేదు : మంత్రి జూపల్లి
సభ్యుల ప్రశ్నలకు మంత్రి జూపల్లి వివరణ ఇస్తూ… జీఎస్టీ అమల్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2.02 లక్షల కోట్లు వెళ్లాయని తెలిపారు. అక్కడి నుంచి మనకొచ్చింది రూ.55 వేల కోట్లేనని వివరించారు. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం ఈ విధంగా వివక్షను చూపుతోందని విమర్శించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జీఎస్టీ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు.
సెస్‌ల పేరుతో కేంద్రం లూటీ : ఎంఐఎం
ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నులెన్ని? అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిందెంతో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంలోనూ దక్షిణాది రాష్ట్రాలపై కక్ష కడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించాలంటూ 30 ఏండ్ల క్రితం కేంద్రం ఆదేశాలిస్తే, వాటిని దక్షిణాది రాష్ట్రాలు తూ.చా తప్పకుండా పాటించాయని గుర్తు చేశారు.
అదే ఇప్పుడు ఆ రాష్ట్రాలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు, నిధులంటూ కేంద్రం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఆ క్రమంలో జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు. ఒకేదేశం-ఒకే పన్ను అంటూ ఊదరగొడుతున్న కేంద్రం… వివిధ రాష్ట్రాల్లోని వైవిధ్యాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదంటూ ప్రశ్నించారు. జీఎస్టీ వల్ల పెట్రోల్, డీజిల్‌పై వేసే పన్నులు, సెస్‌లన్నీ కేంద్రం ఖాతాలోకే పోతున్నాయని చెప్పారు. దేశంలోని ఒక బడా కార్పొరేట్ కంపెనీ ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి పంపిణీ చేస్తోందని, దీంతో బైకుల ఇంజిన్లు పాడైపోతున్నాయని వివరించారు



